‘కన్నప్ప’ చిత్రంలో అగ్ర హీరో ప్రభాస్ పాత్ర ఫస్ట్‌లుక్ ఎలా ఉంటుందోనని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు సోమవారం తెరపడింది. రుద్రుడిగా ఆయన ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘ప్రళయకాల రుద్రుడు..త్రికాల మార్గదర్శకుడు..శివాజ్ఞ పరిపాలకుడు..’ అంటూ ఆయన పాత్రను పరిచయం చేశారు. రుద్రుడి వేషధారణలో ప్రభాస్ దైవత్వం మూర్తీభవించినట్లు కనిపిస్తున్నారు. విడుదల చేసిన కొద్దిగంటల్లోనే ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మోహన్‌లాల్, శరత్‌కుమార్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, బ్రహ్మానందం వంటి అగ్ర తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.