Kannappa Piracy | మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో రూపొందిన కన్నప్ప చిత్రం జూన్ 27న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డా. ఎం. మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రిలీజ్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే, ఈ మూవీ సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్న సమయంలో ‘కన్నప్ప’ చిత్రం పైరసీ బారిన పడింది. ఈ విషయంపై హీరో విష్ణు స్పందిస్తూ, ఇప్పటికే 30 వేలకు పైగా పైరసీ లింక్‌లు తొలగించామన్నారు. అయినప్పటికీ పైరసీ కొనసాగుతుండటం బాధాకరమని తెలిపారు.
“పైరసీలో సినిమా చూడటం అంటే దొంగతనం చేయడమే. మనం మన పిల్లలకు దొంగతనం చేయమని చెప్పము కదా. అలాంటప్పుడు వారిని పైరసీలా సినిమాలు చూడమని ఎలా చెబుతాం?” అని తేలికపాటి ఉదాహరణతో కీలక సందేశం ఇచ్చారు. పైరసీని ప్రోత్సహించకండి. సరైన మార్గంలో సినిమాకు మద్దతు ఇవ్వండి అని విష్ణు విజ్ఞప్తి చేశారు. మేము ఎంతో శ్రమ, పెట్టుబడితో నిరమించే సినిమాలని ఇలా పైరసీ రూపంలో దెబ్బతీయడం కరెక్ట్ కాదు అని విష్ణు పేర్కొన్నారు. సినీ పరిశ్రమకి పైరసీ చాలా ఇబ్బందిగా మారిందని, పైరసీని అరికట్టేందుకు ప్రేక్షకుల సహకారం కూడా తప్పనిసరి అని ఈ సందర్భంగా విష్ణు పేర్కొన్నారు. సినిమాను థియేటర్లలో లేదంటే అధికారిక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రమే చూసి, తమ కష్టానికి ప్రతిఫలం అందేలా చూడాలని కోరారు.
భారీ ప్రాజెక్ట్ గా రూపొందిన కన్నప్ప చిత్రంపౌరాణిక నేపథ్యంతో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విష్ణు కన్నప్ప మూవీ కోసం తన ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టారు. తనకి ఈ సినిమా మీదున్న నమ్మకంతో ఇంకా ఎవ్వరికీ ఏ హక్కుల్ని కూడా అమ్మలేదు. సినిమా రిలీజ్ అయిన తరువాత హిట్ టాక్ వస్తుంది.. అప్పుడు తాను చెప్పిన రేటుకే అమ్మేస్తాను అంటూ విష్ణు ఎంతో నమ్మకంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఓటీటీ డీల్ నడుస్తుంది. మరి ఎవరికి హక్కులు దక్కుతాయో, ఓటీటీ డీల్స్‌లో ఎలాంటి చర్చలు జరుగుతాయో.. పది వారాల కంటే ముందుగానే వస్తుందా లేదా తర్వాత వస్తుందా అనేది చూడాలి.