Kannappa | మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పకి ఊహించని సమస్యలు ఎదురవుతున్నాయి. సినిమాని ఎప్పుడో రిలీజ్ చేయాలని అనుకున్నా కుదరక జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. చిత్రంలో అన్ని ఇండస్ట్రీలకి సంబంధించిన స్టార్స్ ఉండడంతో మూవీపై అందరిలో చాలా ఆసక్తి నెలకొంది. చిత్రంలో విష్ణు మంచుతో పాటు, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, , దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా , విష్ణు కూతుళ్లు ఇలా చాలా మంది స్టార్స్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్.. ఇలా పలు ప్రాంతీయ భాషల్లో కన్నప్ప సినిమాని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
ప్రస్తుతం కన్నప్ప సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మరి కొద్ది రోజులలో విడుదల కానున్న ఈ సినిమా హార్డ్‌డ్రైవ్ మిస్ అయింది. కన్నప్ప మూవీకి సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన హార్డ్ డ్రైవ్ మాయమైనట్లు ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్‌కుమార్ ట్వంట్వీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. అయితే కన్నప్ప సినిమా కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ ఇటీవల కొరియర్ ద్వారా ఫిలింనగర్‌లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపింది. ఈ నెల 25వ తేదీన ఆ కొరియర్ పార్శిల్‌ను కార్యాలయంలో పనిచేసే ఆఫీస్‌బాయ్ రఘు తీసుకున్నాడు.
కొరియర్ వచ్చిందన్న విషయాన్ని అతను ఎవరికి చెప్పకుండా చరిత అనే మహిళకు ఇచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాతి నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు. అయితే తమ సినిమా ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే దురుద్దేశంతో గుర్తుతెలియని వ్యక్తుల మార్గనిర్దేశంలో రఘు, చరిత ఈ కుట్రకు పాల్పడ్డారని విజయ్‌కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. హార్డ్‌డ్రైవ్ అపహరణ వెనుక ఉన్న వ్యక్తులను, వారి ఉద్దేశాలను ఏంటో కనుగొనే పనిలో పోలీసులు ఉన్నారు.