Kantara 2 | కాంతార 2 షూటింగ్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన కపిల్ (32) అనే నటుడు ఉడుపి జిల్లాలోని కొల్లూరు సమీపంలో ప్రవహించే సౌపర్ణిక నదిలో కొట్టుకుపోయి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. కాంతారా 2 సినిమా చిత్రీకరణ ముగిసిన తర్వాత కపిల్ తన స్నేహితులతో కలిసి సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. అయితే, దురదృష్టవశాత్తు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. వెంటనే అక్కడున్న వారు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ, కపిల్‌ను రక్షించలేకపోయారు. ఈ సంఘటనతో కాంతారా 2 చిత్ర బృందం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మరోవైపు కొల్లూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే కపిల్ మృతిపై చిత్రయూనిట్ సంతాపం తెలుపుతూ.. షూటింగ్ ఆపినట్లు తెలుస్తుంది. త్వరలోనే మళ్లీ షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే కాంతార ఛాప్టర్ 1 షూటింగ్ ఆగిపోవడం ఇది కొత్తేమి కాదు. ఇంతకుముందు కూడా పలు వివాదాలతో వార్తల్లో నిలిచింది. గతంలో కొల్లూరులో జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడటం, భారీ గాలులు, వర్షాల కారణంగా సినిమా సెట్ ధ్వంసం కావడం వంటి సంఘటనలు జరిగాయి. అంతేకాకుండా, సినిమా చిత్రీకరణ సమయంలో పర్యావరణానికి నష్టం కలిగించారనే ఆరోపణలపై చిత్ర బృందం అటవీ శాఖ విచారణను కూడా ఎదుర్కొంది.
Kantara