Actor Darshan | కన్నడ నటుడు దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. జైలులో పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం 64వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట దర్శన్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన శారీరక, మానసిక స్థితి చాలా దిగజారిపోయిందని వాపోయాడు. ‘చాలా రోజులుగా సూర్యరశ్మిని చూడలేదు. జైలులో ఫంగస్ భయాన్ని కలిగిస్తోంది. వేసుకునే బట్టల నుంచి దుర్వాసన వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవించడం దుర్భరంగా మారింది. దయచేసి నాకు విషం ఇచ్చి చంపండి’ అంటూ న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు.
దానికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘ఇలాంటి పనులు చేయడం అసాధ్యం’ అని స్పష్టం చేశారు. దర్శన్‌ను పోలీసులు 2024 జూన్‌లో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతని సన్నిహితురాలైన పవిత్రా గౌడకు అభిమాని రేణుకాస్వామి అసభ్య మెసేజ్‌లు పంపాడనే కారణంతో అతనిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో దర్శన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో గతంలో కర్నాటక హైకోర్టు దర్శన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినా.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న కారణంతో సుప్రీం కోర్టు ఈ ఏడాది ఆగస్టు 14న ఆ బెయిల్‌ను రద్దు చేసింది.
పైగా జైలులో ఆయనకు ప్రత్యేక సదుపాయాలు ఇవ్వకూడదని కూడా ఆదేశించింది. దీంతో ఆయనను తిరిగి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. తాజాగా విచారణలో భాగంగా 13, 14వ నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లను కోర్టు పరిశీలించింది. తదుపరి అభియోగాల నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. దర్శన్ తనను బళ్లారి జైలుకు తరలించవద్దని, తాను ఉన్న జైలులో కనీసం మంచం, పరుపు వంటి సౌకర్యాలు కల్పించాలని కోర్టును అభ్యర్థించారు. తన ఆరోగ్య పరిస్థితుల్లో కొంత ఉపశమనం లభించాలనే అభిలాషతో తన మనోవేదనను న్యాయమూర్తికి వెల్లడించారు.