కంగనారనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్ర విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డ్ బ్రేకులు వేసిన విషయం తెలిసిందే. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఈ నెల 6న విడుదలకావాల్సి ఉంది. 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కంగనా రనౌత్.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఆమె దర్శకురాలు కూడా. అయితే ఈ సినిమాలో సిక్కుల మనోభావాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని, ఆపరేషన్ బ్లూస్టార్ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ విడుదలకు అనుమతిని నిరాకరించింది.
ఈ నేపథ్యంలో బాంబే హైకోర్ట్ ఈ సినిమా విడుదలపై కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే బుధవారంలోగా ఈ సినిమా రిలీజ్‌కు అనుమతినిచ్చే విషయంలో తుదినిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ‘ఎమర్జెన్సీ’ సినిమా డాక్యుమెంటరీ కాదని, అదొక ఫిక్షనల్ కథాంశమని హైకోర్టు అభిప్రాయపడింది. సెన్సార్ సర్టిఫికెట్‌కు నిరాకరించడం అంటే సృజనాత్మక వ్యక్తీకరణను అడ్డుకోవడమేనని హై కోర్టు పేర్కొంది.
అయితే రాజకీయపరంగా చాలా సున్నితమైన అంశాలను సినిమాలో ప్రస్తావించారని, ఆ సన్నివేశాల విషయంలో మాత్రమే తాము అభ్యంతరం చెప్పామని సెన్సార్ బోర్డ్ కౌన్సిల్ హైకోర్టుకు విన్నవించింది. ఏది ఏమైనప్పటికీ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో బుధవారంలోగా తప్పకుండా నిర్ణయం తీసుకోవాలని హై కోర్టు సెన్సార్ బోర్డ్‌ను ఆదేశించింది. ఈ పరిణామాలతో ‘ఎమర్జెన్సీ’ విడుదల విషయంలో త్వరలో స్పష్టత వస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.