Actress Kangana Ranaut | గొప్పగా నటించే బాలీవుడ్ నటీమణులలో కంగనా రనౌత్ ఒకరు. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా పలు విమర్శలు తెచ్చుకున్నా.. నటిగా మాత్రం ఆమె రేంజ్ వేరు. ఆమె వల్లే కొన్ని సినిమాలు బంపర్ హిట్లయిన సందర్భాలున్నాయి. ఈ మధ్య కాస్త డల్ అయింది కానీ.. నాలుగైదేళ్ల క్రితం కంగనా పట్టిందల్లా బంగారమే. ఆమె నటించిందంటే సినిమా పక్కా బ్లక్‌బస్టర్ అని ట్రేడ్ పండితులే అనేవాళ్లు. తను వెడ్స్ మను, క్వీన్, మణికర్ణిక వంటి సినిమాలు నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం కంగనా మూడు సినిమాలను లైన్లో పెట్టింది.
కాగా ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మరో తమిళ సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇటీవలే తమిళ ప్రొడక్షన్ సంస్థలు ట్రైడెంట్ ఆర్ట్స్, అహింస ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఓ తమిళ హీరో.. హిందీ హీరోయిన్ ఈ సినిమాలో భాగం కానున్నట్లు వెల్లడించింది. దాంతో ఆ బాలీవుడ్ హీరోయిన్ కంగనానే అని చెన్నై వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మలయాళం దర్శకుడు విపిన్ దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఈ అమ్మడు నటించిన చంద్రముఖి-2 రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. లారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమాకు పి. వాసు దర్శకుడు. తొలిపార్టులో జ్యోతిక పాత్ర ఏ రేంజ్లో ఉందో.. సీక్వెల్లో కంగనా రోల్ కూడా అంతే స్థాయిలో ఉంటుందట. అంతేకాకుండా ఆమె సీన్స్ ప్రేక్షకులను వీర లెవల్లో భయపెడతాయని ఇన్సైడ్ టాక్. ఈ సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకులు ముందుకు రానుంది.