Kangana Ranaut | ఎట్టకేలకు తన ‘ఎమర్జెన్సీ’ మూవీకి సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ స్క్రీనింగ్‌కు అనుమతి ఇచ్చిందని బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురువారం ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా తన అభిమానులు, శ్రేయోభిలాషులకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఎమర్జెన్సీ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ రావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. బోర్డు సూచించిన సవరణలు, సీన్స్ తొలగింపు అంగీకరించామని జీ స్టూడియోస్ బాంబే హైకోర్టుకు ఇటీవల తెలిపింది.
సెన్సార్ బోర్డు సినిమాలో 13 కట్లతో పాటు మార్పులు చేసింది. ఆ తర్వాత మూవీకి యూఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. చిత్రంలో సిక్కు సమాజాన్ని చెడుగా చిత్రీకరించారని ఆరోపిస్తూ పలు సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్ 6న విడుదల చేయాలని నిర్ణయించారు. జూన్ 1975 నుంచి మార్చి 1977 వరకు భారత్‌లో విధించిన ‘ఎమర్జెన్సీ’ ఆధారంగా మూవీని తెరకెక్కించారు. ఈ మూవీకి కంగనా దర్శకత్వం వహిస్తూ నటించారు. మాజీ ప్రధాని ఇందిరా పాత్రను పోషించగా.. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, మిలింద్ సోమన్, మహిమా చౌదరి కీలకపాత్రలు పోషించారు.