Sardaar Ji 3 | పంజాబీ స్టార్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ నటించిన ‘సర్దార్ జీ 3’ చిత్రంపై వివాదం అలుముకున్న విషయం తెలిసిందే. పాకిస్థానీ నటి హానియా అమీర్తో దిల్జిత్ దోసాంజ్ ఈ సినిమాలో నటించడంతో పలు రాజకీయా నాయకులతో పాటు ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదం బాలీవుడ్ నటి కంగనా రనౌత్, పంజాబీ స్టార్ దిల్జిత్ దోసాంజ్ల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.
ఈ వివాదంపై స్పందించిన కంగనా రనౌత్ దిల్జిత్ దోసాంజ్ని ఉద్దేశిస్తూ.. కొంతమందికి వారి సొంత ఎజెండా ఉంటుంది. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. మనం దేశ నిర్మాణ స్ఫూర్తిని కలిగి ఉండాలి. దిల్జిత్ ఎందుకు తన సొంత మార్గంలో వెళ్తున్నాడు? అని కంగనా వ్యాఖ్యానించింది. ఒక సైనికుడికి కూడా దేశభక్తికి సంబంధించిన సొంత ఎజెండా ఉంటుందంటూ కంగనా చెప్పుకోచ్చింది. మనం అందరినీ కలుపుకోని పోవడానికి ప్రయత్నించాలి. అది అసాధారణం అని నేను చెప్పడం లేదు, కానీ రాజకీయ నాయకులకు ఈ ఆలోచనను తీసుకువచ్చినప్పుడే అది జరుగుతుంది అని నొక్కి వెల్లడించింది.
‘సర్దార్ జీ 3’లో దిల్జిత్ దోసాంజ్, హానియా అమీర్, నీరు బజ్వా, గుల్షన్ గ్రోవర్, సప్నా పబ్బి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అమర్ హండల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27న విదేశాల్లో విడుదలైంది. కానీ పాకిస్థానీ కళాకారులపై ప్రభుత్వ నిషేధం కారణంగా భారతదేశంలో విడుదల కాలేదు. ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ సినిమా విడుదల వివాదాస్పదమైంది. దీనికి సమాధానంగా, దిల్జిత్ దోసాంజ్ మాట్లాడుతూ, దాడి జరగడానికి ముందే సినిమా పూర్తయిందని, దాని విడుదల సమయంపై తనకు ఎలాంటి ప్రభావం లేదని పేర్కొన్నారు.