Kanchana 4 | హారర్ కామెడీ సినిమాలకు కొత్త జోరు తెచ్చిన రాఘవ లారెన్స్ మరోసారి తన సూపర్‌హిట్ ఫ్రాంచైజీ ‘కాంచన’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన లారెన్స్, ఇప్పుడు ‘కాంచన 4’ ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ‘ముని’తో మొదలైన ఈ హారర్ సిరీస్ ఇప్పటివరకు మూడు భాగాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు నాలుగో భాగం సెట్స్‌పైకి వెళ్లి షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ నోరా ఫతేహీ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ద్వారా నోరా తమిళ్ చిత్ర పరిశ్రమలో అడుగు పెడుతోంది.
ఈసారి లారెన్స్ దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘కాంచన 4’ను తెరకెక్కిస్తున్నాడు. మొదటి మూడు భాగాలతో పోలిస్తే విజువల్స్, టెక్నికల్ స్టాండర్డ్స్, స్కేల్ అన్నీ మరింత గ్రాండ్‌గా ఉండనున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతోంది.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సాటిలైట్, డిజిటల్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. సమాచారం ప్రకారం, డిజిటల్ రైట్స్ రూ.60 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.50 కోట్లుకి విక్రయమయ్యాయి. ఈ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ సన్ నెక్ట్స్ సొంతం చేసుకున్నట్లు చెన్నై సినీ వర్గాలు వెల్లడించాయి. అంటే, సినిమా థియేటర్లకు రాకముందే మేకర్స్ దాదాపు బడ్జెట్ మొత్తాన్ని నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా తిరిగి సాధించేశారు.
సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు సమాచారం. అంతేకాక, హిందీ వెర్షన్‌ను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు కూడా టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కథ వివరాలు గోప్యంగా ఉంచినప్పటికీ, ‘కాంచన 4’లో మునుపటి భాగాల కంటే ఎక్కువ హారర్, కామెడీ,ఎంటర్టైన్మెంట్ ఉంటుందని టాక్. లారెన్స్ కూడా ఈ సినిమా ద్వారా వచ్చే రెమ్యునరేషన్‌తో తన మొదటి ఇంటిని పాఠశాలగా మారుస్తానని తెలిపారు. సక్సెస్ఫుల్ హారర్ ఫ్రాంచైజీగా పేరుగాంచిన ‘కాంచన’ సిరీస్‌లో భాగంగా వస్తున్న ‘కాంచన 4’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. లారెన్స్ హారర్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందో లేదో చూడాలి!