kamal Hassan | విలక్షణ నటుడు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నుండి సినిమా వస్తుందంటే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. ఖైదీ, మాస్టర్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్‌తో పాటు తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు. ఇప్పటికే చిత్రం బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నమోదు చేశాయి. ఈ చిత్రంలో కమల్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘విక్రమ్’ చిత్రాన్ని అత్యంత భారీగా దాదాపు 110 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆర్ మంహేంద్రన్తో కలిసి కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో రూపొందించాడు. తాజాగా ఈ చిత్రానికి డిజిటల్ శాటిలైట్ హక్కులు కలిపి దాదాపు 115 కోట్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం. ఇదే గనుక నిజమైతే సినిమా థియేట్రికల్ బిజినెస్ జరుగకముందే ఈ చిత్రానికి 5 కోట్ల లాభాలు వచ్చినట్టే. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో ముగ్గురు స్టార్ హీరోలు కలిసి నటించడం వల్ల ఈ స్థాయిలో డీల్ కుదిరిందని కోలీవుడ్ వర్గాల్లో సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.