Kamal Hassan | కమల్ హాసన్, మణిరత్నం ఇద్దరు కూడా లెజండరీ స్టార్స్ . వారు ఎలాంటి సినిమాలు చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరి కాంబోలో ఇటీవల థగ్ లైఫ్ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ అభిమానులకి మంచి వినోదం అందించడం ఖాయం అని అనుకున్నారు. కాని దారుణంగా నిరాశపరిచింది.కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో దాదాపు 38 ఏళ్ల తర్వాత తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలు అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత తనను తాను నిరూపించుకోవాలని కమల్ థగ్ లైఫ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆదరణకి నోచుకోలేకపోయింది. మణిరత్నం ఈ సినిమాతో భారీ హిట్ కొడతాడని అనుకున్నా, ఈ మూవీ దారుణంగా నిరాశపరిచింది. దీంతో ఆయన చాప్టర్ కూడా క్లోజ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
స్క్రీన్‌ప్లే అంచనాలని అందుకోలేక , దీని కారణంగానే థగ్ లైఫ్ మిశ్రమ సమీక్షలను అందుకుంటోంది. సినిమా విడుదలైనప్పటి నుండి మూవీపై నెగెటివ్ టాక్ నడుస్తుంది. థగ్ లైఫ్‌ని ప్రతికూలంగా విమర్శించే వివిధ హ్యాష్‌ట్యాగ్‌లు , మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. కమల్ హాసన్ ఖాతాలో మరో అపజయం అని చాలా మంది ఈ చిత్రాన్ని విమర్శిస్తున్నారు. కన్నడలో రిలీజ్ కాకపోవడంతో తాము బతికిపోయామంటూ కన్నడిగులు విమర్శలు గుప్పిస్తున్నారు. తమ భాషపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడినందుకు ఈ రకంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. మణిరత్నంకు ఫ్యాన్ బేస్ ఉన్న హిందీలో, కమల్ హాసన్‌కు ఫాలోయింగ్ ఉన్న తెలుగులోనూ సరైన ఆదరణ లేకపోవడంతో డిజాస్టర్ దిశగా వెళుతుంది.
సరుకు లేకపోతే ఎంత పెద్ద హీరో సినిమా అయిన తిప్పి కొడతామని థగ్ లైఫ్ నిరూపించింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే భారతదేశంలో రూ. 15.50 కోట్లు వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్లు ఉంటుందని తెలుస్తుండగా, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.62 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.185 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాల్సి ఉంది. డివైడ్ టాక్‌కు తోడు, సోమవారం నుంచి వర్కింగ్ డేస్ ప్రారంభం కావడంతో థగ్‌లైఫ్ నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ నటుడు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకోగా, ఆయనకి నష్టాలు తప్పవని అంటున్నారు. సుధాకర్ రెడ్డి తెలుగులో కమల్ హాసన్ విక్రమ్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయగా, చిత్రానికి ఆయనకు డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. కానీ థగ్ లైఫ్ చిత్రంతో మాత్రం పెద్ద ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి.