Kamal Haasan | “ఇండియన్ 2’ కమల్ అభిమానులకే కాదు, సగటు సినీ అభిమానులందరికీ విందుభోజనం లాంటి సినిమా. ఇందులోని ప్రతి సన్నివేశంలో కమల్ అత్యంతశక్తిమంతంగా కనిపిస్తారు. జూలై 12న ప్రేక్షకులు ఆయన నట విశ్వరూపాన్ని చూస్తారు.’ అని దర్శకుడు శంకర్ అన్నారు. ‘ఇండియన్’ ఫ్రాంచైజీలో భాగంగా ఆయన దర్శకత్వంలో వస్తున్న ‘ఇండియన్ 2’ సినిమా ఆడియో వేడుక చెన్నయ్ నెహ్రూ స్టేడియంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడారు.
కమల్‌హాసన్ మాట్లాడుతూ ‘ఎన్నో అవరోధాలను అధిగమించి విడుదలకు సిద్ధమయ్యింది ‘ఇండియన్ 2’. అన్ని విషయాల్లో మాకు వెన్నంటి ఉండి ముందుకు నడిపించిన నిర్మాత ఉదయనిధి స్టాలిన్ సహకారం మరిచిపోలేనిది. అందరు మెచ్చేలా ‘ఇండియన్ 2’ ఉంటుంది.’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమాను థియేటర్లో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని దర్శకుడు లోకేష్ కనకరాజ్ అన్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ కూడా ఈ వేడుకలో సందడి చేశారు. బ్రహ్మానందం, శింబు, అనిరుథ్, మౌనీరాయ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సినిమా ‘భారతీయుడు2’గా తెలుగులో విడుదల కానున్న విషయం తెలిసిందే.