సినిమా పేరు: థగ్ లైఫ్
తారాగణం: కమల్‌హాసన్, శింబు, త్రిష, అభిరామి, నాజర్, జోజూ జార్జ్..
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: కమల్‌హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంత్, ఉదయ్నిధిస్టాలెన్..
నిర్మాణం: రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్
విడుదల: శ్రేష్ఠ్ మూవీస్.
కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘నాయకుడు’ సినిమా విడుదలై 38ఏండ్లయింది. ప్రస్తుతం ఆ సినిమా ఇండియన్ క్లాసిక్స్‌లో ఒకటి. మళ్లీ మణిరత్నం, కమల్ కలయికలో ‘థగ్‌లైఫ్’ పేరుతో సినిమా వస్తున్నది అనే వార్త వచ్చిన నాటినుంచి, ఆ సినిమా కోసం సగటు ప్రేక్షకుడు సైతం ఆతృతగా ఎదురుచూస్తూనేవున్నాడు. ఎట్టకేలకు ఆ ఎదురు చూపులకు తెరదించుతూ గురువారం ‘థగ్‌లైఫ్’ థియేటర్లో విడుదలైంది. మణిరత్నం, కమల్‌లతో పాటు శింబు, త్రిష, నాజర్, జోజూ జార్జ్.. లాంటి ఉద్దండులు తోడవ్వడం.. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం, రవి కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ.. ఇవన్నీ సినిమాపై అంచనాలు ఆకాశంలో కూర్చోబెట్టాయి. మరి అందరి అంచనాలనూ ‘థగ్ లైఫ్’ అందుకున్నదో లేదో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ
రంగరాయ శక్తివేల్(కమల్‌హాసన్) ఢిల్లీలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్. ఓ కాల్పుల్లో అమర్(శింబు) తండ్రి మరణానికి పరోక్షంగా కారకుడవుతాడు రంగరాయ శక్తివేల్. అంతేకాదు, పసివాడైన అమర్‌ని అడ్డు పెట్టుకొనే ఆ కాల్పుల నుంచి బయట పడతాడు. తాము అమర్‌కి చేసిన అపకారం, అమర్ వల్ల తనకు జరిగిన ఉపకారం, జాలి, పాపభీతి.. ఇవన్నీ పనిచేయడంతో.. అమర్‌ని తీసుకెళ్లి కన్నబిడ్డలా తానే పెంచుతాడు. తప్పిపోయిన తన చెల్లిని వెతికి తీసుకొస్తానని మాట కూడా అమర్‌కి ఇస్తాడు. అలాగే కొనేళ్లు గడిచిపోతాయి. అమర్ పెద్దవాడవుతాడు. తాను కూడా రంగరాయ శక్తివేల్ గ్యాంగ్‌లో ఒకడిగా అవతరిస్తాడు. తన వారసుడు అమరేనంటూ రంగరాయ శక్తివేల్ ప్రకటించడంతో గ్యాంగ్‌లో స్పర్ధలు మొదలవుతాయి. చివరకు రంగరాయ శక్తివేల్ ఆధిపత్యాన్ని కూడా అంగీకరించలేని స్థాయికి గ్రూప్ సభ్యులు చేరతారు. అమర్ మనసును పాడుచేసి, తన తండ్రి మరణానికి రంగరాయ శక్తివేలే కారకుడని అతని తెలియజెప్పి, అందరూ ఓ గ్రూప్‌గా మారి రంగరాయ శక్తివేల్‌ని హత్య చేయడానికి పూనుకుంటారు. అతన్ని కాల్చి లోయలో పడేస్తారు. ఆ తర్వాత ఏమైంది? రంగరాయ శక్తివేల్ మళ్లీ బతికాడా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
గ్యాంగ్‌స్టర్ కథల్లో ఆధిపత్యపోరు. తద్వారా ఎదురయ్యే పరిణామాలపై కథలు చాలానే వచ్చాయి. కథ పాతదైనా దానికి మణిరత్నం మార్క్ మేకింగ్ తోడైతే ఆడియన్స్‌కి వచ్చే కిక్కే వేరు కదా. అదే ఆశించి ‘థగ్ లైఫ్’ కోసం అంతా ఎదురు చూశారు. ఈ సినిమా విషయంలో సింపుల్‌గా ఒక్క విషయం మాత్రమే చెప్పగలం. పాత కథను ఫస్ట్ హాఫ్ వరకు ఆసక్తికరంగానే నడిపించారు మణిరత్నం. సెకండాఫ్‌కి వచ్చేసరికి కాస్తంత తడబాటు పడ్డారేమో అనిపిస్తుంది. మణిరత్నం స్థాయి మేకింగ్ కనిపించదు. ఏదేమైనా మణిరత్నం లాంటి గొప్ప దర్శకుడు తెరకెక్కించిన చిత్రంలో లోటుపాటుల గురించి విశ్లేషించడం సాహసమే అవుతుంది. అందుకే.. వాటి జోలికి పోదలచుకోలేదు. మంచి గురించి మాట్లాడుకుంటే, స్వతహాగా మణిరత్నం సినిమాల్లో కనిపించే విభ్నిమైన మేకింగ్, మేజిక్, అలాగే నటీనటుల వైవిధ్యమైన నటన(మణిరత్నం సినిమ్లాలో మాత్రమే కనిపించే) ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. మణిరత్నం సినిమాలను ప్రేమించే వారు ‘థగ్ లైఫ్’ని కూడా ఎంజాయ్ చేస్తారు.
ఎవరెవరు ఎలా చేశారు?
కమల్‌హాసన్ అభినయం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే ఆయన పాత్రను అనితరసాథ్యంగా అభినయించారు. ఇక ఆ పాత్రను ఆ స్థాయిలో ఎవరూ చేయలేనంత గొప్పగా చేశారు. ఇందులో ఆయన పోషించిన ‘రంగరాయ శక్తివేల్’ పాత్రలో విభిన్న కోణాలుంటాయి. అంతులేని ఎమోషన్స్ ఉంటాయి. వాటన్నింటినీ అద్భుతంగా పండించారు కమల్. ఓ విధంగా ఈ సినిమా వన్‌మ్యాన్ షో. ఆయన అభినయం చుట్టూ సినిమా నడిచింది. ఆయన ధాటికి మిగతా ఆర్టీస్టులు ఎవరూ కూడా కనిపించలేదనే చెప్పాలి. అభిరామి, కమల్ అలాగే త్రిష, కమల్ కాంబినేషన్ సీన్స్ యూత్నే కాదు, సగటు ప్రేక్షకుడ్ని కూడా ఆకట్టుకుంటాయి. శింబు, నాజర్, జోజూ జార్జ్ లాంటి వాళ్లు పరిధి మేర తమ పాత్రలను రక్తి కట్టించారు.
సాంకేతికంగా
మణిరత్నం కథ విషయంలో కాస్త జాగ్రత్త పడితే బావుండేదో అనిపించింది. కథ సరైనదైతే ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉండేది. ఇక మణిరత్నం టేకింగ్ గురించి చెప్పేదేముంది? సినిమాను ఆయన మలిచిన తీరును బట్టి, ఇప్పటికీ ఆయనలో దర్శకత్వ ప్రౌఢీ ఏ మాత్రం సన్నగిల్లలేదని చెప్పక తప్పదు. సరైన కథ కుదిరితే మళ్లీ మణిరత్నం మార్క్ మ్యాజిక్ పక్కా అని ఈ సినిమా చెబుతున్నది. ఇక ఏఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతం బావుంది. ‘విశ్వ నాయక.. విహిత వీరా..’ సాంగ్ బావుంది. మిగతా పాటలు అంత వినబుల్‌గా లేవ్. ఈ సినిమాలో కమల్‌హాసన్, మణిరత్నం తర్వాత చెప్పుకోవాల్సింది కెమెరా గురించి. రవి కె.చంద్రన్ కెమెరా వర్క్ వండర్. ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్‌లా అనిపించింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బావుండేది.
మొత్తంగా సినిమాను నేర్చుకోవాలనుకునేవారికి కచ్ఛితంగా ‘థగ్ లైఫ్’ సినిమా ఓ పాఠమే. కానీ కేవలం వినోదం కోసమే థియేటర్లకు వచ్చేవారిని మాత్రం ఈ సినిమా ఎంతమేరకు అలరిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
బలాలు
కమల్‌హాసన్ నటన, కెమెరా, నేపథ్య సంగీతం..
బలహీనతలు
కథ, కథనం, పాటలు..
రేటింగ్ : 2.75/5