Kamal Hasan – Nani | ప్రముఖ నటుడు కమల్ హాసన్, నాచురల్ స్టార్ నాని పట్ల చూపిన అభిమానం ఇప్పుడు సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. నానిపై కమల్ హాసన్ పరోక్షంగా చూపిన ఈ ప్రశంస అందరినీ ఆకట్టుకోగా, దీనిపై నాని ఇచ్చిన స్పందన ‘పోదుం సర్’ (చాలు సార్) అనే ఒక్క మాటతో అందరి హృదయాలను గెలుచుకుంది.
అసలు ఏం జరిగిందంటే.. కమల్ హాసన్ తన రాబోయే చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని గతంలో కమల్ హాసన్ నటనపై, ముఖ్యంగా ‘విరుమాండి’, ‘అపూర్వ సహోదరులు’ వంటి చిత్రాల్లో ఆయన నటనను ప్రశంసించిన విషయం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై కమల్ హాసన్ స్పందిస్తూ, “నేను నాని పేరు చెప్పడం కూడా అతనికి చాలు. థాంక్యూ నాని అని చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నానో అతనికి అర్థమవుతుంది, ప్రేక్షకులకూ అర్థమవుతుంది” అని అన్నారు. కమల్ హాసన్ ఈ మాటలు చెప్పినప్పుడు, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కాస్త అయోమయంలో పడినప్పటికీ, నానిపై కమల్‌కు ఉన్న గౌరవం, అభిమానం స్పష్టంగా కనిపించాయి.
అయితే కమల్ చేసిన వ్యాఖ్యలపై నాని తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. “పోదుం సర్. పోదుం(చాలు సర్.. చాలు) అంటూ నాని పోస్ట్ చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
నాని ఎప్పటినుంచో తాను కమల్ హాసన్ నటనకు పెద్ద అభిమానిని అని చెబుతూ వస్తున్నారు. ఆయన చిత్రాలలోని కొన్ని సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ, కమల్ హాసన్ నటన తన కెరీర్‌పై ఎంత ప్రభావం చూపిందో వెల్లడించారు. ఇప్పుడు కమల్ హాసన్ నుండి లభించిన ఈ గుర్తింపు నానికి ఎంతో ప్రత్యేకమైనదిగా మారింది. కమల్ హాసన్ నటిస్తున్న ‘థగ్ లైఫ్’ జూన్ 5, 2025న విడుదల కానుండగా, నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.
Podhum sir. Podhum ♥️@ikamalhaasan
— Nani (@NameisNani) May 28, 2025