Thug Life Audio Event | మణిరత్నం దర్శకత్వంలో తమిళ అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమా ఆడియో ఈవెంట్ తాజాగా వాయిదా పడింది. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమల్ హాసన్ స్వయంగా తెలిపారు. భారతదేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, దేశంలో హై అలర్ట్ కొనసాగుతున్న కారణంగా ‘తగ్ లైఫ్’ ఆడియో విడుదల వేడుకను వాయిదా వేస్తున్నట్లు కమల్ హాసన్ ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా ఈ కార్యక్రమం మే 16న నిర్వహించాలని అనుకున్నారు.
భారత దేశ సరిహద్దుల్లోని పరిస్థితులు, ప్రస్తుతం నెలకొన్న హై అలర్ట్ దృష్ట్యా, మే 16న నిర్వహించాలనుకున్న థగ్ లైఫ్ ఆడియో వేడుకను వాయిదా వేయాలని నిర్ణయించాం. మన సైనికులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి మాతృభూమిని కాపాడుతున్న ఈ సమయంలో వేడుకలు చేసుకోవడం కరెక్ట్‌గా ఉండదని నేను భావిస్తున్నాను. పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్త తేదీని ప్రకటిస్తాం. ఈ సమయంలో మా ఆలోచనలన్నీ దేశాన్ని కాపాడుతున్న మన ధైర్యవంతులైన సైనికుల గురించే. పౌరులుగా మనం సంయమనం పాటించాలి, సంఘీభావం తెలపాలి. వేడుకలకు బదులు ఆలోచించాల్సిన సమయం ఇది” అని కమల్ హాసన్ పేర్కొన్నారు. థగ్ లైఫ్ చిత్రం జూన్ 5, 2025న విడుదల కానుంది. ఇందులో కమల్ హాసన్‌తో పాటు శింబు, త్రిష, జోజు జార్జ్, అశోక్ సెల్వన్ మరియు అభిరామి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.