‘నేను యంగ్‌స్టర్‌గా ఉన్నప్పుడు సింగీతం నాకు రెండు కథలు చెప్పారు. అందులో ఒకటి ‘పుష్పక విమానం’గా వచ్చింది. ఇప్పుడు రెండో కథ ‘సింగ్ గీతం’గా రాబోతున్నది. నాకిప్పుడు 70ఏళ్లు. ఇప్పుడు ఈ సినిమా చూడబోతున్నాను’ అని ఆనందం వెలిబుచ్చారు జాతీయ నటుడు కమల్‌హాసన్. సుప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా పతాకాలపై నాగ్ అశ్విన్ నిర్మించిన విభిన్న తరహా చిత్రం ‘సింగ్ గీతం’. అయాన్, అహల్య బమ్రూ, శాలినీ కొండెపుడి కీలక పాత్రల పోషించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలందించారు.
ఈ నెల 11న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా చెన్నైలో ఆదివారం నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడారు. ఇంకా చెబుతూ ‘సింగీతం కథలు ఏజ్లెస్గా ఉంటాయి. సింగీతం ఇప్పటికీ జెన్‌జీ కంటే ముందుంటారు. వైజయంతీ, స్వప్నా సంస్థలు ప్యాషన్‌తో ఈసినిమాను నిర్మించారు. ‘పుష్పక విమానం’లా ఈ సినిమా కూడా ఊహించని విజయాన్ని సాధిస్తుందని నమ్మకంగా చెబుతున్నా’ అని కమల్‌హాసన్ పేర్కొన్నారు.
సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘మాటలే పాటలైతే ఎలా ఉంటుంది? అనే ప్రశ్న నుంచి ఈ కథ పుట్టింది. ఈ సినిమా నా 40ఏళ్ల కల. ఈ కథ ఎంతో మందికి వినిపించాను. వైజయంతీ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకోవడం దైవనిర్ణయం. ఈ సినిమాకు దర్శకుడ్ని నేనే అయినా, నాగ్ అశ్విన్ తన భుజాన వేసుకొని ఈ చిత్రాన్ని ముందుకు నడిపించారు. ఈ సినిమాకు చెందిన క్రెడిట్ నాగ్అశ్విన్కే దక్కుతుంది. దేవిశ్రీ ఈ కథ ఆత్మను పట్టుకొని అద్భుతమైన సంగీతం ఇచ్చారు.
ఆయన తప్ప ఇంకెవరూ ఇంత అద్భుతమైన సంగీతం అందించలేరు’ అని తెలిపారు. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయని, ఈ సినిమాకు పనిచేయడం బ్లెస్సింగ్‌గా భావిస్తున్నానని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అన్నారు. ఇంకా నిర్మాత అశ్వనీదత్, నటీనటులు శాలిని కొండెపుడి, అయాన్, అహల్య బమ్రూ కూడా మాట్లాడారు.