కొన్ని రోజుల క్రితం రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి నటించనున్నారంటూ, ఈ మల్టీస్టారర్ మూవీకి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారంటూ ఓ వార్త మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యింది. 40ఏండ్ల క్రితం అమితాబ్ కథానాయకుడిగా బాలీవుడ్లో రూపొందిన ‘గిరఫ్తార్’ సినిమాలో రజనీ, కమల్ కలిసి నటించారు. తర్వాత వారి కాంబినేషన్లో సినిమా లేదు. కాలక్రమంలో ఒకరు జాతీయ నటుడిగా ఎదిగితే, మరొకరు సౌతిండియన్ సూపర్‌స్టార్‌గా వినుతికెక్కారు. వీరిద్దరి మార్కెట్ కూడా వందలకోట్లకు ఎకబాకింది. ఇలాంటి సందర్భంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే సాధ్యమేనా? అనే అనుమానం చాలామందిలో నెలకొని ఉన్నది.
ఈక్రమంలో ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ, తమ మల్టీస్టారర్ మూవీపై అధికారిక ప్రకటన చేశారు జాతీయ నటుడు కమల్‌హాసన్. ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకలో కమల్ ఈ బిగ్ అప్డేట్ ఇచ్చేశారు. ‘మీరూ, రజనీ కలిసి నటించే సినిమాను మేం ఆశించొచ్చా?’ అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు కమల్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. ‘కలిసి నటించాలని మేం ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్నాం.. కానీ కుదర్లేదు.
త్వరలోనే మీ ముందుకు కలిసి వస్తున్నాం. అది మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది.’ అన్నారు కమల్‌హాసన్. తమ మధ్య అభిప్రాయబేధాలున్నాయంటూ వస్తున్న వార్తలపై కమల్ స్పందిస్తూ ‘అవన్నీ కేవలం కొందరు సృష్టించినవే. మేం ఎప్పుడూ కలిసే ఉన్నాం. అసలు మేం ఒకరికి ఒకరం పోటీగా ఏనాడూ ఫీలవ్వలేదు. కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూశాం. ఒకరు హీరోగా మరొకరం సినిమాలు నిర్మించేందుకు కూడా ప్రయత్నించాం.’ అంటూ వివరణ ఇచ్చారు కమల్. ఇదిలావుంటే.. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కమల్, రజనీ ఇద్దరూ గ్యాంగ్‌స్టర్స్‌గా కనిపిస్తారట.