Kamal Haasan | ‘ఆస్కార్ అవార్డును ప్రత్యేకంగా పరిగణించను. భారతీయ నటుడిగా ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలన్నదే నా కల. ఇది పొగరుతో చెబుతున్న మాట కాదు. నాపై నాకున్న నమ్మకంతో చెబుతున్నమాట.’ అని కమల్‌హాసన్ అన్నారు. ఆస్కార్ అవార్డు గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కమల్ పై విధంగా స్పందించారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమల్ మాట్లాడారు. ‘సినిమాకు కథే ముఖ్యం. కథ డిమాండ్ మేరకే పాత్రలుండాలి. ఈ సినిమాలో కమల్‌సార్ పాత్ర నిడివి తక్కువ అని చాలామంది అనుకుంటున్నారు. అందులో నిజంలేదు. ఇందులో ఆయన లేని సన్నివేశంలో కూడా ఆయన గురించే చర్చ నడుస్తుంటుంది. పార్ట్ 1లో అవినీతిపై పోరాటం చూపించాను. ఈ పార్ట్‌లో పోరాటం వైవిధ్యంగా ఉంటుంది.’ అని శంకర్ అన్నారు.
కథ డిమాండ్ మేరకే మూడో పార్ట్ కూడా తెస్తున్నామని, డబ్బుకోసంకాదని, ‘భారతీయుడు2’ యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టే ఇన్ని పార్టులు తీయాల్సి వచ్చిందని శంకర్ తెలిపారు. ‘భారతీయుడు 2’లో భాగం కావడంపట్ల హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్ ఆనందం వెలిబుచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈ సినిమాకు పంపిణీదారుడైన ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు, బాబీ సింహా కూడా పాల్గొన్నారు.