Kamal Hassan | లోకనాయకుడు కమల్ హాసన్‌తో పాటు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా అరుదైన గౌరవం అందుకున్నారు. అంతర్జాతీయంగా భారతీయ సినిమా ప్రతిష్టను పెంచుతూ ప్రముఖ నటులు కమల్ హాసన్, అయుష్మాన్ ఖురానా ఆస్కార్ అకాడమీ సభ్యులుగా ఎంపికయ్యారు. ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ తాజాగా విడుదల చేసిన 2025 సభ్యత్వ జాబితాలో వీరిద్దరికీ చోటు దక్కింది. ఇకపై ఆస్కార్ అవార్డుల తుది నామినేషన్ల ఎంపికలో వీరు ఓటింగ్ హక్కుతో భాగస్వాములవుతారు. భారతీయ సినీ రంగానికి ఇది మరింత గౌరవాన్నితీసుకురావడమే కాకుండా, ఈ ఇద్దరు నటుల ప్రతిభకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కింది.
ఈ ఏడాది సభ్యత్వానికి ఎంపికైన వారిలో కమల్, అయుష్మాన్తో పాటు ప్రముఖ దర్శకురాలు పాయల్ కపాడియా, ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు కూడా ఉన్నారు. మొత్తం 534 మందికి సభ్యత్వ ఆహ్వానం అందగా, అందులో 19 విభాగాలకు చెందిన నిపుణులకు చోటు దక్కింది. కొత్తగా ఆహ్వానం పొందిన వారిలో 41 శాతం మహిళలు ఉన్నారు. వచ్చే సంవత్సరం మార్చి 15న ఆస్కార్ అవార్డు వేడుక జరగనుండగా, జనవరి 12 నుండి 16 మధ్య నామినేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. వాటి పరిశీలన అనంతరం తుది నామినేషన్ల జాబితాను జనవరి 22న ప్రకటించనున్నారు. అయితే కమల్ హాసన్ వంటి లెజెండరీ నటుడితో పాటు యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఆస్కార్ కుటుంబంలో చేరడం గర్వకారణం అని భారతీయులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక కమల్ హాసన్ రీసెంట్గా థగ్ లైఫ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పలు వివాదాలలో కూడా చిక్కుకుంది. కర్ణాటలో చిత్రం విడుదల కాలేదు. మిగతా చోట మూవీకి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. నాయకుడు చిత్రం తర్వాత కమల్- మణిరత్నం కాంబోలో రూపొందిన ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో ఫ్యాన్స్ చాలా అప్సెట్ అయ్యారు. మూవీ రిజల్ట్ విషయంలో స్పందించిన మణిరత్నం క్షమాపణలు తెలియజేశాడు.