Kamal Hassan | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ దూసుకుపోతున్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూనే.. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌పై భారీ ప్రాజెక్టులను వరుసగా లైన్లో పెడుతున్నారు. టాప్ హీరోలు, స్టార్ దర్శకులతో రూపొందుతున్న ఈ చిత్రాలు ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారితీస్తున్నాయి. కమల్ హాసన్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘ధర్మన్’ ఒకటి. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, దర్శకుడు అశ్వత్ మరిముత్తు ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. యంగ్ స్టార్ శివకార్తికేయన్ హీరోగా ‘సేయోన్’ అనే భారీ చిత్రాన్ని కూడా రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివకుమార్ మురుగేషన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. విడుదల తేదీతో పాటు ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా భావిస్తున్న రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్ కూడా సిద్ధమవుతోంది.
ఈ చిత్రానికి ‘జైలర్’ ఫేమ్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు. రెడ్ జెయింట్ మూవీస్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ‘చిత్తా’, ‘వీర ధీర సూరన్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎస్.యూ. అరుణ్ కుమార్‌తో కూడా కమల్ హాసన్ కొత్త సినిమా చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. అరుణ్ కుమార్ సిద్ధం చేసిన రెండు కథలను కమల్ త్వరలో విననున్నారని తెలుస్తోంది. వాటిలో ఒక కథ నచ్చితే కమల్ స్వయంగా హీరోగా నటించే అవకాశం ఉంది. లేదంటే అదే కథను రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై మరో స్టార్ హీరోతో నిర్మించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇతర హీరోల సినిమాలతో పాటు కమల్ హాసన్ తన తదుపరి నటన ప్రాజెక్టులపై కూడా దృష్టి సారించారు. ప్రస్తుతం ఆయన కోసం రెండు కొత్త కథలు సిద్ధమవుతున్నాయని, వాటిలో ఒకదాన్ని త్వరలో ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.