రివ్యూ : అమిగోస్
తారాగణం: కల్యాణ్‌రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్‌రాజన్
సంగీతం: జిబ్రాన్
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి
రచన-దర్శకత్వం: రాజేంద్రరెడ్డి
సినిమాల ఎంపికలో అగ్ర హీరో కల్యాణ్‌రామ్ పంథాయే వేరు. ప్రయోగాత్మక ఇతివృత్తాలకు పెద్ద పీట వేస్తారాయన. కమర్షియల్ అంశాల్ని మిస్ చేయకుండా కథలో కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. జయాపజయాలతో సంబంధం లేకుండా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని తపిస్తారు. గత ఏడాది ‘బింబిసార’ వంటి హిస్టారికల్ ఫిక్షన్ కథాంశంతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు కల్యాణ్‌రామ్. దాంతో ఆయన తాజా చిత్రం ‘అమిగోస్’ ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచింది. ఇందులో కల్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయం చేయడం మరింత ఆసక్తినిరేకెత్తించింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పించింది? మూడు పాత్రల్లో కల్యాణ్‌రామ్ ఎలాంటి పర్ఫార్మెన్స్ కనబరిచాడు? కల్యాణ్‌రామ్ చేసిన మరో ప్రయోగం ఎలాంటి ఫలితాన్నిచ్చిందో తెలుసుకుందాం..
కథ గురించి:
సిద్ధార్థ్ (కల్యాణ్‌రామ్) హైదరాబాద్‌లో పెద్ద వ్యాపారవేత్త. రియల్ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. తొలి పరిచయంలోనే రేడియో జాకీ ఇషిక (ఆషికా రంగనాథ్) ప్రేమలో పడతాడు. పెద్దల అంగీకారంతో ఈ జంట నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. అదే సమయంలో మనుషుల్ని పోలిన మనుషులుంటారని ఓ వెబ్సైట్ ద్వారా తెలుసుకుంటాడు సిద్ధార్థ్ . ఈ క్రమంలో బిపిన్రాయ్ అలియాస్ మైఖేల్, మంజునాథ్‌లను కలుస్తాడు. ఈ ముగ్గురూ మంచి మిత్రులవుతారు. అనంతరం తమ సొంత ఊరు బెంగళూరు వెళ్లడానికి మంజునాథ్, కోల్‌కతా వెళ్లడానికి మైఖేల్ సిద్ధమవుతారు. కానీ ఇంతలోనే ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంటుంది. హైదరాబాద్‌లో ఓ ఎన్ఐఏ అధికారిని చంపేసిన మైఖేల్..ఆ కుట్రలో మంజునాథ్‌ను ఇరికిస్తాడు. మంజునాథ్‌ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు మైఖేల్ ఎవరు? దేశానికి వ్యతిరేకంగా అతను చేసిన కుట్రలు ఏమిటి? తన రహస్య ప్లాన్‌ను అమలు చేయడానికి అతను సిద్ధూ, మంజునాథ్‌లను ఎలా వాడుకున్నాడు? తన పోలికలతో ఉన్న ఇద్దరు వ్యక్తులను కలవడం ద్వారా సిద్ధూ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే మిగతా కథ..
కథా విశ్లేషణ:
మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మనుషులను పోలిన మనుషులు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించామని ప్రచార కార్యక్రమాల్లోనే వెల్లడించడంతో ఈ కథమీద ప్రేక్షకులకు ముందుగానే అవగాహన ఉంది. కల్యాణ్‌రామ్ చేసిన మూడు పాత్రల్లో ఒకరు విలన్‌గా కనిపిస్తారు. తనలాంటి పోలికలున్న ఇద్దరు వ్యక్తులను వాడుకొని ప్రతినాయకుడు తన పన్నాగాల్ని ఎలా అమలు చేశాడు..అతడి బారి నుంచి మిగతా ఇద్దరు ఎలా బయటపడ్డారన్నదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. సినిమా ప్రథమార్థం ఆసక్తిగా మొదలవుతుంది. మూడు పాత్రల్ని పరిచయం చేయడం, వారితో కథను నడిపించిన విధానం మెప్పిస్తుంది. అయితే సిద్ధూ, ఇషికా లవ్ ఎపిసోడ్ రొటీన్‌గా సాగుతుంది. కాన్సెప్ట్పరంగా ఈ కథ కొత్తగా అనిపించినా.. స్క్రీన్‌ప్లే మరింత పకడ్బందీగా రాసుకుంటే బాగుండేదనిపిస్తుంది. కథలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎత్తుకు పై ఎత్తులు మిస్సయ్యాయి.
ఇంటర్వెల్ ముందు కథాగమనం కాస్త ఉత్కంఠగా మారుతుంది. అక్కడి మలుపులతో ద్వితీయార్థం ఎలా ఉంటుందోననే ఆసక్తి కలుగుతుంది. మైఖేల్ వేసిన ప్లాన్ వల్ల మంజనాథ్‌ను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకోవడం, అనంతరం మైఖేల్ నిజస్వరూపం ఏమిటో సిద్ధార్థ్ తెలుసుకోవడంతో సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ద్వితీయార్థంలో మైఖేల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రతినాయకుడు మైఖేల్ పాత్రలో కల్యాణ్‌రామ్ లుక్స్, బాడీలాంగ్వేజ్ కొత్తగా అనిపిస్తాయి. యాక్షన్ ఎపిసోడ్స్‌లో మొదలైన సెకండాఫ్ క్యూరియాసిటీ పెంచుతుంది .ఆ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. బిపిన్రాయ్ అనే నరరూప రాక్షసుడిగా ై కల్యాణ్‌రామ్ పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది. ప్రథమార్థంతో పోల్చితే సెకండాఫ్ ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. క్లెమాక్స్ ఘట్టాలు కాస్త ఉత్కంఠను పంచాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్:
కల్యాణ్‌రామ్ మూడు పాత్రల్లో చక్కటి వైవిధ్యాన్ని ప్రదర్శించారు. ప్రతినాయకుడు మైఖేల్ పాత్రలో ఆయన నటన ఆకట్టకుంటుంది. విలనీ అద్భుతంగా పండించాడు. నటుడిగా ఆయన్ని మరో మెట్టెక్కించే చిత్రమిది. కథానాయిక ఆషికా రంగనాథ్ గ్లామర్ రోల్‌కే పరిమితమైపోయింది. బ్రహ్మాజీ, సప్తగిరి నవ్వించారు. మిగతా పాత్రలు తమ పరిధుల మేరకు నటించారు. జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ పాటను అందంగా పిక్చరైజ్ చేశారు. సౌందర్‌రాజన్ కెమెరా పనితనం బాగుంది. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్‌లో కొత్తదనం ఉంది. స్క్రీన్‌ప్లే మరింత దృష్టి పెడితే బాగుండేది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్:
విభిన్నమైన కాన్సెప్ట్
ప్రతినాయకుడిగా కల్యాణ్‌రామ్ అభినయం
సాంకేతికంగా ఉన్నతమైన విలువలు
మైనస్ పాయింట్స్:
పేలవమైన స్క్రీన్‌ప్లే
కథలో ఎమోషన్స్ మిస్ కావడం
రేటింగ్: 2.5/5