Bimbisara Theatrical Rights | హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. చాలా కాలం తర్వాత ‘118’తో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గాను ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘బింబిసార’ ఒకటి. మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాగా.. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఫాంటసీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమాకు భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరిగిందట.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు రూ.15 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. కళ్యాణ్‌రామ్ గత రెండు మూడు చిత్రాలు రూ. 12 కోట్లకు పైగా దాటలేదు. ఈ సారి ఏకంగా రూ.15 కోట్లకు ధర పలికాయంటే విశేషం అనే చెప్పాలి. ఫలితం ఎలా ఉన్న కళ్యాణ్ రామ్ మాత్రం విభిన్న జానర్లలో సినిమాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే బింబిసార వంటి వినూత్న సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఎన్టీఆర్ అర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్, వారినా హుస్సేన్‌లు కథానాయికలుగా నటించారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించాడు.