Kalyan Art Productions | తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి మరో కొత్త నిర్మాణ సంస్థ అడుగుపెట్టింది. వినూత్నమైన కథలను, సరికొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్మాత కళ్యాణ్ తాజాగా ‘కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్’ (Kalyan Art Productions) బ్యానర్‌ను ఘనంగా ప్రారంభించారు. ప్రస్తుత సినిమా రంగంలో కొత్తవారికి అవకాశాలు రావడం సవాలుగా మారిన తరుణంలో, కేవలం ప్రతిభనే ప్రాతిపదికగా తీసుకుని ఈ సంస్థను స్థాపించినట్లు నిర్మాత తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కథే హీరో అనే సిద్ధాంతంతో, సమాజానికి అవసరమైన సమకాలీన అంశాలను, ప్రేక్షకులను అలరించే సరికొత్త కంటెంట్‌ను అందించడమే మా ప్రథమ ప్రాధాన్యత అని తెలిపాడు. కొత్త దర్శకులు, నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు మా బ్యానర్ ఒక సరైన వేదికగా నిలుస్తుంది. క్రియేటివిటీకి పూర్తి స్వేచ్ఛనిస్తూ, ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. ఈ బ్యానర్లో ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన కథలు చర్చల దశలో ఉన్నాయని, అన్నీ కుదిరితే సంక్రాంతి పండుగ సందర్భంగా తమ మొదటి సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్మాత కళ్యాణ్ వెల్లడించారు. అదే సమయంలో సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలోకి కొత్త ఆలోచనలతో అడుగుపెడుతున్న ‘కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్’ మరిన్ని విజయవంతమైన చిత్రాలను నిర్మించాలని సినీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.