Kalpika | సినీ నటి కల్పిక గణేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రీసెంట్గా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. సోమవారం మధ్యాహ్నం రిసార్ట్‌కు ఒంటరిగా వచ్చిన కల్పిక, రిసెప్షన్ వద్ద సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించారు. రిసార్ట్ మేనేజర్ కృష్ణపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మెనూ కార్డు, రూమ్ తాళాలను ముఖంపై విసిరేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. “సిగరెట్స్ ఏది రా..!” అంటూ సిబ్బందిపై ఊగిపోయిన ఆమె, దాదాపు 40 నిమిషాల పాటు హంగామా సృష్టిస్తూ నానా రచ్చ చేసిందట.
ఆ తర్వాత కల్పిక మాట్లాడుతూ, తాను ఎలాంటి తప్పు చేయలేదని, రిసార్ట్ సిబ్బంది తాను అడిగిన చిన్న విషయాలను కూడా పట్టించుకోకుండా నన్ను ఇబ్బందికి గురి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై ఆమె తీసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కస్టమర్‌గా అక్కడికి వెళ్లినప్పుడు కనీస మర్యాద, స్పందన లేకపోవడం నన్ను ఎంతగానో బాధించిందని, అందుకే వారిని బూతులు తిట్టాల్సి వచ్చిందని పేర్కొంది. ఒక కేసులో ఇరుక్కున్న నేను డిప్రెషన్లో ఉండడంతో కాస్త రిలాక్స్ అవ్వడానికి అక్కడికి వెళ్తే అక్కడ కూడా మనశ్శాంతి కరువైందని ఆవేదన వ్యక్తం చేసింది. నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి అక్కడికి వెళ్లలేదని పేర్కొంది. అలానే అక్కడ తాను తీసిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇది కల్పికకు సంబంధించి తొలి వివాదం కాదు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో జరిగిన ఓ ఘటనతో కూడా ఆమె వార్తల్లోకి ఎక్కారు. తన పుట్టినరోజు వేడుకల నిమిత్తం పబ్‌కి వెళ్లిన కల్పిక, అర్థరాత్రి డిజర్ట్ విషయంలో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.ఆ సమయంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో పెట్టి, “పబ్ సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు” అంటూ ఆరోపించారు. అయితే, పబ్ యజమాన్యం మాత్రం ఆమెనే తప్పుబడుతూ, ప్లేట్లు విసిరేయడం, బాడీ షేమింగ్ చేయడం వంటి పనులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో 324(4), 352, 351(2) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.అంతే కాకుండా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులపైనా ఆమె అసభ్య పదజాలంతో మాట్లాడింది. ఈ వ్యవహారం కూడా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి వరుస ఘటనల నేపథ్యంలో, నెటిజన్లు కల్పిక ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసమో లేక మానసిక ఒత్తిడిలో ఆమె అలా చేస్తుందో అర్ధం కావడం లేదు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.