Kalki Kondapalli | మరో 6 రోజుల్లో ప్రభాస్ కల్కి సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ ప్రారంభంకాగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. మూవీ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ మూవీ క్రేజ్ ఇప్పుడు కొండపల్లికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు సమీపంలో ఉన్న కొండపల్లి అంటే తెలియనివారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా కొండపల్లి బొమ్మలు ప్రసిద్ధి చెందాయి. కొండపల్లి గ్రామం కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో ఉంది. కొండపల్లి బొమ్మలు కొండపల్లి చుట్టుపక్కల అడవులలో దొరికే పొనికి అనే తేలికపాటి చెక్క నుండి తయారవుతాయి. కొండపల్లి కళాకారులు ఏకాగ్రతతో ఈ బొమ్మలు తయారు చేస్తారు.
అయితే కొండపల్లి కళాకారులు తాజాగా ‘కల్కి’ బొమ్మలను తయారు చేశారు. ‘కల్కి’ మూవీలోని ప్రభాస్ ‘భైరవ’ పాత్రతో పాటు ‘బుజ్జి’, అమితాబ్ బచ్చన్ ‘అశ్వథామ’ పాత్రలను పోలిన కొండపల్లి బొమ్మలను కళాకారులు రూపొందించారు. ఇక తాజాగా ‘కల్కి’ కొండపల్లి బొమ్మలు తయారు చేస్తున్న వీడియోను వైజయంతి మూవీస్ సంస్థ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.