Kalki 2898 AD | మరో 4 రోజుల్లో ప్రభాస్ కల్కి సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌తో పాటు ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ షోలు వేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జితేందర్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో స్పెషల్ షోలు నిర్వహించుకునేందుకు ఈ నెల 27 నుంచి వచ్చేనెల 4 వరకు అనుమతులు ఇవ్వాలని ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ రాష్ట్ర హోంశాఖను కోరగా.. ఐదు షోలు వేసేందుకు, టికెట్ ధర రూ.200 పెంచుకునేందుకూ హోంశాఖ వారికి అనుమతులు ఇచ్చింది. అలాగే రూ.75, రూ.100 టిక్కెట్ల ధరలనూ పెంచుకునేందుకూ అనుమతులు ఇచ్చింది.
ఇక పెరిగిన ధరలను బట్టి టికెట్ల రేట్లను చూసుకుంటే.. బెనిఫిట్ షోల రేట్లు.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.377 గా.. మల్టీప్లెక్స్‌లలో రూ.495 గా ఉండబోతుంది. ఇక బెనిఫిట్ షో అనంతరం రెగ్యులర్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.265 ఉండగా.. మల్టీప్లెక్స్‌లలో రూ. 413 గా నిర్ణయించారు. అయితే టికెట్ల పెంపు వలన మూవీ ఎఫెక్ట్ పడుతుందా అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇంతకుముందు ఇద్దరు కలిసి సినిమాకి వెళితే రూ.500 అయ్యేవి. ఇప్పుడు ఒక్కరికే రూ. 500 అవ్వబోతున్నాయి అంటూ మూవీ లవర్స్ అందోళన చెందుతున్నారు.