ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ మైథాలజీ చిత్రం ‘కల్కి’ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో చిత్ర బృందం ప్రచార పర్వంలో వేగాన్ని పెంచింది. ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కల్కి’ కథ తాలూకు ఆసక్తికరమైన విషయాలను ఓ వీడియో ద్వారా పంచుకున్నారు దర్శకుడు నాగ్అశ్విన్. ఆయన మాట్లాడుతూ ‘ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ‘కల్కి’ కథతో కనెక్ట్ అవుతుంది. మన జానపద చిత్రాల్లో పాతాళ భైరవి, భైరవ ద్వీపం, ఆదిత్య 369 నాకు ఇష్టమైన సినిమాలు. ‘స్టార్‌వార్స్’ లాంటి సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సినిమాలు హాలీవుడ్‌లోనే రావాలా? మన కథలతో అలాంటి సినిమాలు తీయలేమా? అనిపించేది.
దశావతారాల్లో ఒకటైన కృష్ణావతారం ద్వాపరయుగంలో వస్తే.. కలియుగం ఆఖరులో పదవ అవతారమైన కల్కి ఆగమనం జరుగుతుంది. అప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే ఊహ నుంచి ఈ కథ రాసుకున్నా. మనం చదివిన పురాణాలన్నింటికి ఈ కథ క్లైమాక్స్‌లా ఉంటుంది. వెలుగు చీకటి నడుమ సంగ్రామంలో చివరికి ఏం జరుగుతుందనే ఆలోచన నుంచే ఈ కథ రాసుకున్నా. కథ రాసుకోవడానికి ఐదేళ్లు పట్టింది. సైన్స్ ఫిక్షన్‌కు మైథాలజీని జోడించి చేసిన ఈ ప్రయత్నం తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది’ అన్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమితాబ్, కమల్‌హాసన్, దీపిక పదుకొనే, దిషాపటానీ, రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖతారలు నటిస్తున్న విషయం తెలిసిందే.