90వ దశకంలో యువతరం కలల రాణిగా భాసిల్లింది కాజోల్. అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ సీనియర్ నటి తాజాగా ‘మా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. మైథలాజికల్ హరర్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కాజోల్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తాను తిరస్కరించిన కొన్ని చిత్రాలు బ్లాస్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయని, అయినా తాను పెద్దగా బాధపడలేదని చెప్పింది. ఈ సందర్భంగా అమీర్‌ఖాన్ క్లాసిక్ చిత్రం ‘3ఇడియట్స్’ గురించి మాట్లాడింది.
‘ఈ సినిమాలో తొలుత నాయికగా నన్నే అడిగారు. ఎందుకో తెలియదు కానీ వద్దనుకున్నా. ఆ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ‘3 ఇడియట్స్’ రిలీజ్ తర్వాత నా సన్నిహితులు నా నిర్ణయం తప్పని పదేపదే గుర్తు చేసేవారు. సినిమా వదులుకున్నందుకు నేనేమి బాధపడలేదు. చక్కటి ప్రతిభగల నటినే ఆ పాత్ర వరించింది. కొన్ని సినిమాలు కొందరికే రాసిపెట్టుంటాయి’ అని కాజోల్ వ్యాఖ్యానించింది. భారతీయ సినిమాలో తొలిసారి 300కోట్లు సాధించిన చిత్రంగా ‘3ఇడియట్స్’ చరిత్ర సృష్టించింది.