Kajal Aggarwal | స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. దశాబ్దానికి పైగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అగ్ర కథానాయికగా రాణించిన ఆమె ప్రస్తుతం వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తల్లి అయిన తర్వాత తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని, ఇప్పుడు సినిమాల ఎంపికలో కొత్త ప్రమాణాలను పాటిస్తున్నానని కాజల్ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం ది ఇండియా స్టోరీ తో పాటు ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రామాయణ’ షూటింగ్‌లతో బిజీగా ఉన్న కాజల్, ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తల్లి అయిన తర్వాత సినిమాలకు ఓకే చెప్పే విధానం పూర్తిగా మారిపోయిందని కాజల్ తెలిపారు. ఇప్పుడు ఏ కథ వినినా ముందు ఒక నటిగా కాకుండా తల్లిగా ఆలోచిస్తాను. నా కొడుకు నీల్ పెద్దయ్యాక నా సినిమాలు చూసి, ‘ఇది మా అమ్మ చేసిన గొప్ప సినిమా’ అని గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. అందుకే ఇప్పుడు స్క్రిప్ట్ ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాను అని చెప్పారు. కేవలం కమర్షియల్ అంశాల కోసం కాకుండా, మంచి కథ, బలమైన పాత్ర, సమాజానికి ఉపయోగపడే సందేశం ఉన్న చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. చేతన్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ది ఇండియా స్టోరీలో కాజల్ అగర్వాల్ ఓ పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. శ్రేయస్ తల్పడే కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ కథలో కల్తీ ఆహారం, వ్యవసాయంలో అధికంగా వాడుతున్న పురుగుమందుల వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాన్ని చూపించారు. స్క్రిప్ట్ విన్న తర్వాత ఒక తల్లిగా నేను చాలా ఆలోచించాను” అని చెప్పారు. ది ఇండియా స్టోరీ షూటింగ్ అనంతరం తన ఇంటి జీవనశైలిలో కూడా మార్పులు చేసుకున్నట్లు కాజల్ తెలిపారు. ఈ సినిమా చేసిన తర్వాత మా ఇంట్లో వాడే ఆహార పదార్థాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించాను. నా కొడుకు నీల్‌కు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఏవి ఇవ్వకూడదు అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. సినిమా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా అవగాహన కల్పించింది అని పేర్కొన్నారు. మరోవైపు బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణలో కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో కాజల్ మండోదరి పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమా గురించి మాట్లాడుతూ, తన కుమారుడు నీల్‌కు రామాయణంపై ఉన్న ఆసక్తిని కూడా కాజల్ వెల్లడించారు. నీల్‌కు చిన్నప్పటి నుంచే రామాయణ కథలు, రామలీలా విజువల్స్ చూడటం చాలా ఇష్టం. నేను ‘రామాయణ’ సినిమాలో నటిస్తున్నానని చెప్పగానే చాలా సంతోషించాడు. అయితే ఆశ్చర్యకరంగా అతనికి శ్రీరాముడి కంటే రావణుడి పాత్రే ఎక్కువ ఇష్టంఅంటూ కాజల్ నవ్వుతూ చెప్పారు. అలాగే, ‘రామాయణ’ రెండో భాగం విడుదలయ్యే సమయానికి నీల్‌కు ఐదేళ్లు వస్తాయని, థియేటర్లో తాను చూసే మొదటి సినిమా ఇదే అయ్యే అవకాశం ఉందని ఆనందం వ్యక్తం చేశారు.