Kajal Aggarwal | వాల్మీకి రామాయణంలో సీత పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో.. రావణాసురుడి అర్ధాంగి మండోదరి పాత్రకు కూడా అంతటి ప్రాధాన్యత ఉంది. సీతకు ఏమాత్రం తీసిపోని మహాపతివ్రత మండోదరి. జమున, బి.సరోజాదేవి, కృష్ణకుమారి వంటి మేటి నటీమణులు ప్రాణప్రతిష్ట చేసిన పాత్ర అది. అలాంటి గొప్ప పాత్ర కాజల్ అగర్వాల్‌ని వరించిందనేది ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో లేటెస్ట్ న్యూస్.
రణ్‌బీర్‌కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పానిండియా పౌరాణిక చిత్రం ‘రామాయణ’లో యష్ రావణుడిగా నటిస్తుండగా, మండోదరిగా కాజల్ అగర్వాల్ ఖరారయ్యారట. ఇప్పటికే టీమ్ ఆమెను సంప్రదించిందనీ, కాజల్ కూడా మండోదరిగా కనిపించేందుకు సుముఖత వ్యక్తం చేశారనేది బాలీవుడ్ సమాచారం. గతవారం లుక్ టెస్ట్ కూడా జరిగిందని ఓ ఆంగ్ల వెబ్సైట్ ప్రచురించింది. ఇదే నిజమైతే.. కాజల్ కెరీర్లోనే గుర్తుండిపోయే పాత్ర ఇదే అవుతుంది. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 2026 దీపావళికి తొలి భాగాన్ని, 2027 దీపావళికి మలిభాగాన్నీ విడుదల చేస్తామని నిర్మాతల్లో ఒకరైన నమిత్ మల్హోత్రా ఇటీవలే ప్రకటించారు.