kaantha Movie Slight Delay | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన లోక సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్లు రాబడుతుండటంతో తన కాంత సినిమా విడుదలను వాయిదా వేశాడు దుల్కర్. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించాడు.
ప్రియమైన ప్రేక్షకులకు.. ‘కాంత’ టీజర్ విడుదలైనప్పటి నుంచి మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, మద్దతు మా హృదయాలను హత్తుకున్నాయి. మీ అభిమానం మాకు ఎంతో విలువైనది. మా సినిమా ద్వారా మీకు మరింత మెరుగైన అనుభూతిని అందించాలని మేము కోరుకుంటున్నాం. ‘కొత్త లోక’ ఘన విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద చంద్ర విజయయాత్ర కొనసాగించాలని మేము మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. అదే ఉత్సాహంతో, మిమ్మల్ని మరో అద్భుతమైన సినీ ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి మేము సిద్ధమవుతున్నాం. ఈ నేపథ్యంలో మా చిత్రం ‘కాంత’ విడుదల తేదీని వాయిదా వేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాము. అప్పటివరకు మీ మద్దతు ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాం. త్వరలోనే మీ అందరినీ థియేటర్లలో కలుసుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నాం. అంటూ కాంత టీమ్ రాసుకోచ్చింది. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 12, 2025న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ సినిమా ఇప్పుడు దీపావళికి వాయిదా పడుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సముద్రకని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.