చేతబడులు, క్షుద్రపూజల నేపథ్యంలో నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘కాళంకి భైరవుడు’. రాజశేఖర్‌వర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రితిక, పూజ కిరణ్, భవ్యశ్రీ కీలక పాత్రధారులు. హరిహరన్.వి దర్శకుడు. కేఎన్ రావు, డా.రచ్చమల్ల శ్రీనివాసరావు నిర్మాతలు. వచ్చే నెల 24న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
దర్శకుడు సాయిరాజేశ్ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల ప్రధాన పాత్రధారులంతా ఆనందం వెలిబుచ్చారు. దర్శకుడు హరిహరన్ విజన్ అద్భుతమని, ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన సంఘటనలతో సినిమా రూపొందుతున్నదని నిర్మాత కేఎన్ రావు అన్నారు. నిజజీవిత సంఘటనల ప్రేరణతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు హరిహరన్.వి తెలిపారు. ఇంకా సంగీత దర్శకుడు పి.ఆర్ కూడా మాట్లాడారు.