K Ramp | టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి తన ప్రత్యేక కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. తాజాగా విడుదలైన కె ర్యాంప్ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి చేరింది. కిరణ్ అబ్బవరం నటన, హాస్య పంచులు, రొమాంటిక్ ట్రాక్ అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. “అలా కాళ్లూపకూడదేమో బాబూ” అని బామ్మ చెప్పగా, “నేను ఊపడం లేదు బామ్మా.. నా గర్ల్‌ఫ్రెండ్ ని తలుచుకుంటే వాటంతట అవే ఊగుతున్నాయి” అనే రిప్లయ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అలాగే “కనీసం ఈరోజైనా డబ్బున్నోడిలా బిహేవ్ చేయ్ రా”, “వరమిస్తానంటూ నా వెంటపడుతున్నాడు సార్”, “లవ్ చేస్తే లైఫ్ ఇస్తానని వరమిచ్చాను సార్”, “పెద్దయ్యాక నా జీవితం ఇలా ఉంటుందని తెలిస్తే చిన్నప్పుడే కుత్తిక పిసుక్కొని చచ్చిపోయేవాడిని” వంటి పంచ్‌లతో ప్రేక్షకులు నవ్వులు పూయిస్తున్నారు. ట్రైలర్ మొత్తం చూస్తే దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ శైలిని గుర్తు చేస్తోంది. హాస్యం, రొమాన్స్ మేళవించిన ఎంటర్టైనర్గా సినిమా ఉంటుందని అంచనా వేస్తున్నారు సినీ లవర్స్. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజ హీరోయిన్గా నటిస్తోంది.
వీకే నరేష్, వెన్నెల కిషోర్, సాయి కుమార్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించగా, హాస్య మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మొదట టీజర్ విడుదలైనప్పుడు కొంతమంది ఈ సినిమాను అడల్ట్ ఎంటర్టైనర్గా భావించినప్పటికీ, ట్రైలర్‌తో ఆ అనుమానాలకు ముగింపు పలికారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కనిపిస్తున్న ఈ చిత్రం, కిరణ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. దీపావళి కానుకగా ఈ నెల 18న గ్రాండ్‌గా విడుదల కానుంది. సినీ సర్కిల్స్ టాక్ ప్రకారం ఈ చిత్రం ఇండియా వైడ్‌గా దాదాపు రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగుతుందట. అంటే ఈ చిత్రం వసూలు చేయాల్సిన గ్రాస్ రూ.16 కోట్లు. దీపావళి బరిలో మొత్తం ఆరు సినిమాలు(మూడు తెలుగు, మూడు డబ్బింగ్) రిలీజ్ అవుతుండటంతో పోటీ తీవ్రంగా ఉంది.