గత ఏడాది ‘క’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు హీరో కిరణ్ అబ్బవరం. దాంతో ఆయన నెక్ట్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కిరణ్ అబ్బవరం 11వ ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చేసింది. సినిమా పేరు ‘కె.ర్యాంప్’. జైన్స్ నాని దర్శకుడు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి అగ్రనిర్మాత దిల్‌రాజు క్లాప్ ఇవ్వగా, మరో అగ్ర నిర్మాత అనిల్ సుంకర కెమెరా స్విచాన్ చేశారు.
డైరెక్టర్స్ విజయ్ కనకమేడల, రామ్ అబ్బవరం, యదువంశీ, రైటర్ ప్రసన్న కలిసి స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్లో కిరణ్ అబ్బవరం మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. టైటిల్ లోగోలో కనిపిస్తున్న బొమ్మ, మందు సీసా, ఆ ఫుట్బాల్ని చూస్తుంటే.. ఇది మాస్ యాక్షన్ అడ్వంచర్ అని అవగతమవుతున్నది. యుక్తి తరేజా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నరేష్, వెన్నెల కిశోర్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌రెడ్డి మాసం, సంగీతం: చేతన్ భరద్వాజ్, సహనిర్మాతలు: బాలాజీ గుట్ట, ప్రభాకర్ బురుగు.