ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఇప్పుడు స్టార్ హీరో భార్య. అంతేకాదు, అంతకుమించి విలక్షణ నటి. హీరోయిన్గా నిరూపించుకున్న జ్యోతిక హీరో సూర్యను పెండ్లి చేసుకున్న తర్వాత వెండితెరకు కొంత దూరం పాటించింది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమవుత్నుది. ఇటీవల ఆమె నటించిన ‘సైతాన్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్లు వసూలు చేసింది. కమర్షియల్ మూవీస్ కాకుండా కథాప్రాధాన్యం ఉన్న చిత్రాలను చేస్తానని చెబుతున్నది జ్యోతిక. తమిళంతోపాటు బాలీవుడ్‌లోనూ అవకాశాలు చేజిక్కించుకుంటున్నది.
తన సినిమాల్లో స్టార్ హీరోలు అవసరం లేదనీ, ఇకపై చేసే చిత్రాల్లో లీడ్ రోల్ తానే పోషిస్తానని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో భర్త సూర్యతోపాటు స్టార్ హీరోలు రజినీకాంత్, విజయ్, మమ్ముట్టి గురించి జ్యోతిక చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘విజయ్‌కు కన్సిస్టెన్సీ ఎక్కువ. సినిమా కోసం మమ్ముట్టి ఎంతో కష్టపడతారు. సూర్య అందరికీ మర్యాద ఇస్తారు. గౌరవంగా చూస్తారు. ప్రతి ఒక్కరికీ సమయం కేటాయిస్తారు. అదే ఆయనపై ఉన్న గౌరవాన్ని మరింతగా పెంచుతుంది. స్నేహానికి సూర్య ఎంతో విలువ ఇస్తారు. అందుకే ఆయనతో స్నేహం చేయడానికి అందరూ ఇష్టపడతారు’ అని సహనటుల గుణగణాలను పంచుకున్నది మన చంద్రముఖి.