వెండితెరపై హిట్ పెయిర్‌గా, నిజ జీవితంలో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు అగ్ర హీరో సూర్య, జ్యోతిక. వివాహనంతరం చాల ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది జ్యోతిక. ఇద్దరు పిల్లల బాధ్యతలు తీసుకోవడంతో సినిమాలపై ఏమాత్రం దృష్టిపెట్టలేదు. ‘36 వయదినిలే’ చిత్రంలో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
బాలీవుడ్లో అజయ్‌దేవ్‌గన్ సరసన ‘సైతాన్’ సినిమాలో నటించి భారీ విజయాన్ని దక్కించుకుంది. మలయాళంలో మమ్ముటితో కలిసి ఓ సినిమా చేసింది. త్వరలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నది. ఇదిలా వుండగా భర్త సూర్యతో కలిసి జ్యోతిక ఓ సినిమాలో నటించనుందనే వార్త కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. సూర్య, జ్యోతిక కలిసి ఉయిరిలే కలందదు, పేరళగన్, కాక్క కాక్క, సిల్లన్ను ఒరు కాదల్ వంటి హిట్ చిత్రాల్లో నటించారు.
తాజా సమాచారం ప్రకారం ‘బెంగళూరు డేస్’ ఫేమ్ అంజలీమీనన్ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక సినిమా చేయబోతున్నారని తెలిసింది. ఈ వార్త నిజమైతే పెళ్లయిన తర్వాత సూర్య, జ్యోతిక కలిసి నటించనున్న సినిమా ఇదే అవుతుంది. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ హిట్‌పెయిర్ మరోమారు కలిసి నటించబోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.