Jyothi Rai | కన్నడ పరిశ్రమకు చెందిన బుల్లితెర నటి జ్యోతిరాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గుప్పెడంత మనసు సీరియల్ లో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నది. సీరియల్స్‌తో పాటు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. టాలీవుడ్‌తో పాటు కన్నడ పరిశ్రమలో కూడా జ్యోతిరాయ్‌కు మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ నటి తాజాగా ఆర్థికంగా ఇబ్బందులతో బాధపడుతున్న కిన్నెర మొగిలయ్యకు సాయం చేసి తన గొప్ప మనసును చాటుకుంది.
పద్మ శ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కిన్నెర మొగిలయ్యకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నెలకు రూ.10 వేల పెన్షన్‌ను కాంగ్రెస్ సర్కారు నిలిపివేసింది. దాంతో ఆయన ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నిరుపేద కళాకారుడిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే మొగిలయ్య పరిస్థితి అత్యంత దారుణంగా ఉండడంతో ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్ధిక సహాయం అందించాడు. ఇక తాజాగా కన్నడ నటి జ్యోతిరాయ్ కూడా కిన్నెర మొగిలయ్యను కలుసుకుని తన వంతుగా రూ. 50 వేల ఆర్థిక సాయం చేసి గొప్ప మనసును చాటుకుంది. ఈ విషయం తెలిసిన అభిమానులు సినీ ప్రేక్షకులు ఆమెపై ప్రశంసంల వర్షం కురిపిస్తున్నారు.