Jyothi Krishna | పవన్ కళ్యాణ్ నటించిన తొలి పీరియాడికల్ హిస్టారికల్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ . ఈ మూవీ జులై 24న విడుదలై మిశ్రమ స్పందనతో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా, ఏఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మించారు.17వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్య కాలం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కొహినూర్ వజ్రం కోసం వీరమల్లు (పవన్ కళ్యాణ్) చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కించారు. చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, బాబీ డియోల్ ప్రతినాయక పాత్ర పోషించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ హిందువులపై పెట్టిన జిజియా పన్ను దురాచారాలను సినిమాలో బలంగా ప్రస్తావించారు.
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు ట్రేడ్ రిపోర్టులు వెల్లడించాయి.ఇండియాలో తొలి రోజు ₹34.75 కోట్లు,రెండో రోజు ₹8 కోట్లు, మూడో రోజు ₹9.86 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇలా మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ చిత్రం ₹65 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించిందని సమాచారం.అయితే, చిత్రబృందం కలెక్షన్లపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ, “మేము ఏం ప్రకటించినా అది ఫేక్ అని అంటారు. అందుకే కలెక్షన్లను వెల్లడించడం లేదు. అనధికారికంగా కొన్ని పోస్టర్లు సర్క్యూలేట్ అవుతున్నాయి అని స్పష్టం చేశారు. కలెక్షన్స్ విషయంలో పూర్లి క్లారిటీ వచ్చాక ప్రకటిస్తాం అని జ్యోతికృష్ణ అన్నారు.
ఇక చిత్రంపై వస్తున్న నెగటివ్ రివ్యూలపై జ్యోతికృష్ణ స్పందిస్తూ.. కథ, కథనం, మ్యూజిక్, నటుల పెర్ఫార్మెన్స్ దేన్ని తప్పుపట్టే పనిలేదు. కానీ కొందరు కావాలని కొన్ని అంశాలపై మాత్రమే దృష్టి పెట్టి నెగటివ్ ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. మొదటి కాపీలో చిన్నపాటి తప్పులు ఉన్నాయని, వాటిని త్వరగా సరిచేసినట్లు తెలిపారు. సినిమాపై వచ్చిన స్పందనపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..“మేము చెప్పాలనుకున్న విషయాన్ని బలంగా చెప్పగలిగాం. కలెక్షన్లు ఎలా ఉన్నా, సినిమా లక్ష్యం నెరవేరింది అనేది నాకు ముఖ్యం,” అని అన్నారు. ఈ చిత్రం కోసం పవన్ మేకోవర్, సినిమా బడ్జెట్, ఇతిహాస నేపథ్యం సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.