Jwala Gutta on Gouri Kishan Issue | మలయాళం సినీ నటి గౌరీ కిషన్ ఎదుర్కొన్న బాడీ-షేమింగ్ ప్రశ్నపై పలువురు సినీ ప్రముఖులు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై సింగర్ చిన్మయితో పాటు నటి ఖుష్బూ సుందర్, నటుడు కవిన్ తదితరులు ఇలాంటి ప్రశ్నలను ఖండిస్తూ.. గౌరీకి మద్దతుగా నిలిచారు. అయితే ఈ వివాదం ముదురుతున్న భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల కూడా ఈ అంశంపై తన గళం విప్పారు. ముఖ్యంగా వృత్తి జీవితంలో (professional life) మహిళలను మాత్రమే టార్గెట్ చేసే పద్ధతిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మహిళలను ఎప్పుడూ వారి బరువు, వయస్సు, పెళ్లయిందా?, పిల్లలను కనే ఆలోచన ఉందా? అనే ప్రశ్నలు అడగడం చాలా నిరాశను కలిగిస్తోంది. అదే వారి విలువను, కెరీర్ సామర్థ్యాన్ని నిర్ణయించినట్లుగా అడుగుతారు. ఏ నటుడిని కూడా అతని లుక్స్ లేదా వ్యక్తిగత జీవితం గురించి ఈ విధంగా అడగరు అని గుత్తా మండిపడింది. ఇలాంటి వెర్రి ప్రశ్నలతో సంబంధం లేకుండా మహిళలు విజయం సాధించడం ఎందుకు తప్పు? మనం ఈ పాత పురుషాధిక్య (Misogynistic) ఆలోచనల నుంచి బయటపడాలి. మహిళలను వారి అందం ఆధారంగా కాకుండా వారి ప్రతిభ ఆధారంగా గౌరవించడం ప్రారంభించాలి అని జ్వాల రాసుకోచ్చింది.
“It’s frustrating how women are always asked about their weight, age, whether they’re married, or if they plan to have children, as if that defines their worth or career potential. Meanwhile, no one would ever ask a male professional about his looks or personal life in the same…
— Gutta Jwala 💙 (@Guttajwala) November 7, 2025
అసలు ఏం జరిగిందంటే.. ఈ మూవీలో ఓ పాట సన్నివేశంలో హీరో ఆదిత్య మాధవన్ గౌరీని ఎత్తుకుని తిప్పుతాడు. అయితే చిత్రబృందం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని సాకుగా తీసుకుని రిపోర్టర్ హీరోని అడుగుతూ.. హీరోయిన్ను ఎత్తుకుని తిరిగేటప్పుడు ఆమె బరువు ఎంత ఉంది? భారీగా అనిపించిందా? అని అడుగుతాడు. దీనికి హీరో సమాధానమిస్తూ.. నేను జిమ్ చేస్తాను కాబట్టి భారీగా అనిపించలేదు అని చెబుతాడు. అయితే ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మరో ప్రెస్ మీట్ జరుగుతుంది.. ఆ ఈవెంట్లో కూడా సదరు రిపోర్టర్ గౌరీ బరువు గురించి మళ్లీ అడుగుతాడు. దీంతో చిర్రెత్తుకోచ్చిన గౌరీ ఆ రిపోర్ట్ర్పై విరుచుకుపడింది.
నా బరువు తెలుసుకుని నువ్వు ఏం చేయబోతున్నావు? ఇది బాడీ షేమింగ్! ఒక స్త్రీని ఆబ్జెక్టిఫై చేస్తున్నావు. నా పాత్ర గురించి, నా నటన గురించి ఒక్క ప్రశ్న కూడా లేదు. అందరూ నా బరువే అడుగుతున్నారు. మగ నటుల్ని ఇలా అడిగే ధైర్యం మీకు ఉందా? ఇది జర్నలిజం కాదు… మీ వృత్తికే అవమానం అంటూ ప్రశ్నలతో కడిగిపారేసింది. అయితే కొంతమంది రిపోర్టర్లు ఆ ప్రశ్నను కేవలం సరదాగా అడిగినట్లు కొట్టిపారేయడానికి ప్రయత్నించారు. కానీ గౌరీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించింది. నాకు అది సరదాగా అనిపించలేదు. బాడీ-షేమింగ్‌ను నార్మలైజ్ చేయడం ఆపండి. ఆ ప్రశ్న నా గురించి కాబట్టి నా అభిప్రాయాన్ని చెప్పే హక్కు నాకు ఉంది అని ఆమె తేల్చి జెప్పింది.