హైదరాబాద్: నటసార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) శత జయంతి సందర్భంగా.. నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. వారితోపాటు ఎన్టీఆర్ సమతీమణి లక్ష్మీపార్వతి కూడా నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలుగు జాతి గర్వించదగ్గ అసమాన ప్రతిభ కలిగిన నటుడు ఎన్టీఆర్ అని, తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటుందన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా పేరుగాంచారని చెప్పారు.
కాగా, ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించనున్నారు. వేడుకల్లో తమ కుటుంబం నుంచి నెలకు ఒకరుచొప్పున కార్యక్రమాల్లో పాల్గొంటారని నటుడు బాలకృష్ణ చెప్పారు. శతజయంతి ఉత్సవాల సందర్భంగా వారానికి ఐదు సినిమాలు, రెండు సదస్సు నిర్వహిస్తామన్నారు. అలాగే నెలకు రెండు ఎన్టీఆర్ పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు.