కిరీటిరెడ్డి హీరోగా పరిచయం అవుతున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకుడు. రజనీ కొర్రపాటి నిర్మాత. అగ్ర కథానాయిక శ్రీలీల ఇందులో హీరోయిన్గా నటిస్తుండటం విశేషం. రవిచంద్రన్, జెనీలియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 18న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పానిండియా స్థాయిలో గ్రాండ్‌గా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా మ్యూజికల్ జర్నీని సోమవారం బెంగళూర్‌లో స్టార్ట్ చేస్తూ.. ఈ సినిమాలోని తొలిపాటను విడుదల చేశారు. ‘లెట్స్ లివ్ దిస్ మూమెంట్..’ అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రాయగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచారు.
జస్ప్రీత్ జాజ్ పాటను ఆలపించారు. ఈ సినిమాలోని ప్రతి మూమెంట్‌నీ ఎంజాయ్ చేశానని, దేవిశ్రీప్రసాద్ సంగీతం, సెంథిల్ కెమెరా సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయని, లెంజెండరీ యాక్టర్ వి.రవిచంద్రన్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని హీరో కిరీటిరెడ్డి చెప్పారు. ఈ సినిమా తనకు లైఫ్ లాంగ్ మెమొరీ అనీ, దేవిశ్రీ, సెంథిల్‌లతో కలిసి పనిచేయడం పట్ల ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నానని దర్శకుడు తెలిపారు. ఇంకా రవిచంద్రన్, దేవిశ్రీప్రసాద్, డీవోపీ సెంథిల్ కుమార్, కొరియోగ్రఫర్ విజయ్ పోలాకి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: కల్యాణ్‌చక్రవర్తి త్రిపురనేని, నిర్మాణం: వరాహి చిత్రం.