Kantara Chapter 1 | కాంతార చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలో విడుదలైన ‘కాంతార’ రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. రిషబ్ శెట్టి ఈ సినిమాలో హీరో మాత్రమే కాదు, రచయిత – దర్శకుడు కూడా ఆయనే. తొలి పార్ట్ మంచి సక్సెస్ కావడంతో ఇప్పుడు రెండో పార్ట్‌ని ‘కాంతార: చాప్టర్ 1’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్‌ను అక్టోబర్ 2, 2025న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. కాంతార సినిమా 2022 సెప్టెంబర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సరిగ్గా మూడు సంవత్సరాల తర్వాత కాంతార ప్రీక్వెల్ రాబోతుంది. కాంతార సినిమాకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ చేస్తున్న నేపథ్యంలో మూవీపై ఆసక్తి పెరిగింది.
అయితే ‘కాంతార: చాప్టర్ 1’ చిత్ర బృందానికి ఇటీవల ప్రమాదాల ఎక్కువ అవుతుండడం మనం చూస్తూ ఉన్నాం. కొన్ని రోజుల క్రితం కొల్లూరులో జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత గాలి వానకు భారీ ఖర్చుతో నిర్మించిన సెట్ పూర్తిగా ధ్వంసం కావడం మనం చూశాం. ఇక తాజాగా సినిమా షూటింగ్లో జూనియర్ ఆర్టిస్ట్ కన్నుమూయడం ఇప్పుడు విషాదంలోకి నెట్టేసింది.. ‘కాంతార: చాప్టర్ 1′ సినిమా కోసం పనిచేస్తోన్న కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయాడు. ఉడిపి జిల్లా బైందూర్ లోని కొల్లూరులో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది.
షూటింగ్ ముగిసిన తర్వాత కపిల్ తన బృందంతో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. నీటి లోతు అంచనా వేయలేక నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ మరణంతో చిత్ర బృందం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై చిత్ర బృందం ఒక అధికారిక ప్రకటన వెలువరించనుందని సమాచారం.