బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఠక్కున అగ్ర హీరో సల్మాన్‌ఖాన్ పేరు గుర్తుకొస్తుంది. అయితే కెరీర్ తొలినాళ్లలో సల్మాన్‌ఖాన్ నాటి టాప్ హీరోయిన్లలో ఒకరైన జూహీచావ్లాను ఎంతగానో ఇష్టపడ్డారట. పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.
ఈ విషయాన్ని గతంలో అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాడు సల్మాన్‌ఖాన్. తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది. ‘జూహీ వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఎందుకోగానీ వాళ్ల నాన్న పెళ్లికి అంగీకరించలేదు’ అని సల్మాన్‌ఖాన్ తెలిపారు. ఈ వీడియోపై జూహీచావ్లా స్పందించింది. పెళ్లి కోసం సల్మాన్‌ఖాన్ తన కుటుంబ సభ్యులను సంప్రదించిన మాట నిజమేనని, అయితే అప్పటికి ఆయన కెరీర్లో స్థిరపడకపోవడంతో పెళ్లికి అంగీకరించలేదని తెలిపింది.