Bigg Boss Winner| తెలుగు యూట్యూబర్, బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం బిగ్‌బాస్ ఫైనల్స్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫైనల్స్ నేపథ్యంలో సీజన్-7 షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్‌కు అమర్, ప్రశాంత్ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అయితే పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ సీజన్ 7 విజేత (Bigg boss Winner) అని ప్రకటించగానే ప్రశాంత్ అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో ఇరువురి అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం పరస్పర దాడులకు దారితీసింది. ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు.
అటుగా వెళ్తున్న టీఎస్ఆర్టీసికి చెందిన 6 సిటీ బస్సులపై దాడిచేసి అద్దాలు పగలగొట్టారు. ఇక బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట పోలీస్ వాహనం అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా అభిమానులు పగలగొట్టారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక ఈ దాడులను సుమోటోగా స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని అభిమానులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.