జె.ఎస్.కె: జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ
జీ5: స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం: సురేశ్ గోపి, అనుపమ పరమేశ్వరన్, మాధవ్ సురేశ్, శ్రుతి రామచంద్రన్, దివ్య పిైళ్లె, అస్కర్ అలీ, మేధా పల్లవి తదితరులు
దర్శకత్వం: ప్రవీణ్ నారాయణన్
‘కోర్ట్ రూమ్’ డ్రామాలు అభిమానుల ఆదరణ పొందుతున్నాయి. న్యాయం కోసం బాధితులు చేసే పోరాటాలు, న్యాయవాదుల వాదోపవాదాలతో.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి. ఈ ‘కోర్ట్’ నేపథ్యంలో.. టాలీవుడ్ మొదలుకొని అన్ని భాషల్లోనూ ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. అలాంటి కథే.. జె.ఎస్.కె: జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. మహిళల హక్కులు, సామాజిక బాధ్యతలను స్పృశిస్తూ.. భావోద్వేగంగా సాగుతుందీ సినిమా. జూలైలో థియేటర్లలో విడుదలై.. ఇటీవలే ‘జీ 5’ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. హిట్ టాక్‌తో రికార్డ్ వ్యూస్ సాధిస్తున్నది. కథలోకి వెళ్తే.. కేరళకు చెందిన జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్).. బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తూ ఉంటుంది.
పండుగ సెలబ్రేషన్స్ కోసం స్నేహతురాళ్లను తీసుకొని స్వగ్రామానికి వస్తుంది. వాళ్లను బస్సు ఎక్కించిన తరువాత.. అంతకుముందు తాము ఆగిన బేకరీలో ఫోన్ మరిచిపోయినట్లు గుర్తిస్తుంది. అప్పటికే బాగా చీకటిపడుతుంది. ఫోన్ కోసం బేకరికి వెళ్లిన ఆమెపై.. గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడుతారు. దాంతో, న్యాయ పోరాటానికి సిద్ధమవుతుంది జానకి. అడ్వకేట్‌గా గొప్ప పేరున్న డేవిడ్ (సురేశ్ గోపీ).. ఆమెకు వ్యతిరేకంగా వాదిస్తాడు. లభించిన ఆధారాలు, తన తెలివితేటలతో తన క్లయింట్స్‌ను కాపాడతాడు.
ఈ క్రమంలో జానకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? న్యాయవాది డేవిడ్ నిందితుల పక్షాన ఎందుకు వాదిస్తాడు? మళ్లీ జానకికి సహాయం చేయాలని ఎందుకు నిర్ణయించుకుంటాడు? ఆ నిర్ణయం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? తన ప్రమేయం లేకుండా తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ప్రభుత్వమే చూసుకోవాలన్న జానకి విజ్ఞప్తిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది? న్యాయ పోరాటంలో జానకి గెలిచిందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే.. సినిమా చూడాల్సిందే!