ఈసారి ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటుడి విభాగంలో ఎన్టీఆర్ పోటీ పడే అవకాశాలున్నాయని అమెరికన్ పత్రిక యూఎస్ఏ టుడే అంచనా వేసింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటనకు ఎన్టీఆర్ ఉత్తమ నటుడి కేటగిరీలో గట్టి పోటీ ఇచ్చే అవకాశముందని ఆ పత్రిక అభిప్రాయపడింది. ఇటీవల పలు అంతర్జాతీయ సినీ వేదికలపై ఈ సినిమా సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
దర్శకత్వంలో లాస్ ఏంజెలీస్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్, న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు ఇచ్చాయి. ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కింది. బాఫ్టా పురస్కారం కొద్దిలో చేజారింది. ఈ క్రమంలో ఆస్కార్ ఉత్తమ నటుడి పోటీలో ఎన్టీఆర్ ఉంటాడనే అంచనాలు ఏర్పడుతున్నాయి. గతంలో ప్రముఖ హాలీవుడ్ మేగజైన్ వెరైటీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
రాజమౌళికి జేమ్స్ కామెరూన్ ఆఫర్
ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ వీక్షించిన విషయం తెలిసిందే. తాజాగా తాను జేమ్స్ కామెరూన్‌తో జరిపిన సంభాషణ తాలూకు వివరాల్ని రాజమౌళి ఓ స్పెషల్ వీడియో ద్వారా పంచుకున్నారు. హాలీవుడ్లో ఎప్పుడైనా సినిమా చేసే ఉద్దేశ్యం ఉంటే తనను సంప్రదించాలని జేమ్స్ కెమెరూన్ రాజమౌళిని కోరారు.
“ఆర్ఆర్ఆర్’ కథాంశాన్ని నిప్పు, నీరు ప్రతీకలుగా అల్లుకున్న విధానం, నేపథ్య కథను వివరించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. రాజమౌళి సృష్టించిన పాత్రల్ని తెరపై చూస్తుంటే ఓ అద్భుతమైన అనుభూతికిలోనయ్యాను. అలాగే సినిమాలో నాయకుల మధ్య చూపించిన స్నేహం, వైరం సన్నివేశాలు మరో స్థాయిలో ఉన్నాయి’ అని జేమ్స్ కామెరూన్ కొనియాడారు.