యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొద్ది రోజులుగా ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో రూపొందుతున్న సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు.
జనవరి 7న చిత్రం విడుదల కానుండగా, ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతున్నారు. నవంబర్ 10న చిత్రం నుండి రెండో పాట విడుదల చేయనున్నారు.ఈ పాట ప్రకటనకి సంబంధించి పోస్టర్ విడుదల చేయగా, ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు వెస్టర్న్ స్టైల్లో మాస్ స్టెప్పులతో కుమ్మేసినట్టు కనిపించారు.
త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఆ లోపు తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్నాడు.దీపావళి పండుగ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొడుకులతో కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. ఇక రీసెంట్గా తన భార్య లక్ష్మీ ప్రణతితో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, ఇతర స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న పిక్స్ బయటకు వచ్చాయి. ఇందులో ఎన్టీఆర్ చేతికి పెద్ద కట్టు కనిపిస్తుంది.
జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో తారక్ చేతి వేలికి గాయమవ్వగా.. ఆసుపత్రిలో చిన్న సర్జరీ కూడా చేయించుకున్నారని సమాచారం. అయితే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని, త్వరలోనే నయం అవుతుందని అంటున్నారు.