NTR | ఈ నెల 20న అగ్రహీరో ఎన్టీఆర్ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రాలు ‘వార్-2’, ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్)కు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎన్టీఆర్‌నీల్’ సినిమా ఫస్ట్‌లుక్ కోసం ఉత్కంఠత ఎక్కువైంది. అయితే ఈ విషయంలో అభిమానులను కాస్త డిజప్పాయింట్ చేస్తూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఎన్టీఆర్ బర్త్‌డే రోజున ‘వార్-2’ అప్డేట్ వస్తున్నందున, ‘ఎన్టీఆర్‌నీల్’ అప్డేట్ను వాయిదా వేశామని, సరైన సమయంలో మిసైల్ వంటి బ్లాస్టింగ్ న్యూస్‌ను అందిస్తామని వెల్లడించింది. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. అదే సమయంలో ఎలాగూ ‘వార్-2’ అప్డేట్ ఉంది కదా…ఈసారికి దాంతో సరిపెట్టుకుందాంలే అని రిలీఫ్‌గా ఫీలవుతున్నారు. ఎన్టీఆర్-ప్రశాంత్‌నీల్ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఎన్టీఆర్ తొలి స్ట్రెయిట్ హిందీ చిత్రం ‘వార్-2’ ఆగస్ట్ 14న విడుదలకానుంది.