NTR | అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్‌నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న పాన్ ఇండియా యాక్షన్ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. మే నెలలోనే ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడింది. అప్పటి నుంచి ఈ సినిమా లాంచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్ని ఉన్నాయని, వాటన్నింటిని అందుకునేలా అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని, ఎన్టీఆర్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: భువన్‌గౌడ, సంగీతం: రవి బస్రూర్, ప్రొడక్షన్ డిజైన్: చలపతి, నిర్మాతలు: నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు, రచన-దర్శకత్వం: ప్రశాంత్‌నీల్.